వాషింగ్టన్, జనవరి 13: అమెరికన్ సమాజానికి భారత సంతతి ప్రజలు అందిస్తున్న సేవలపై ఆ దేశ పార్లమెంట్ సభ్యుడు మెక్ కార్మిక్ (54) ప్రశంసల వర్షం కురిపించారు. అమెరికా జనాభాలో భారత సంతతి ప్రజలు కేవలం 1 శాతంగా ఉన్నప్పటికీ పన్నుల్లో వారి వాటా దాదాపు 6 శాతం మేరకు ఉన్నదని తెలిపారు. నిరుడు నవంబర్లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో జార్జియా జిల్లా నుంచి గెలుపొందిన ఆయన తొలిసారి అమెరికా ప్రతినిధుల సభలో ప్రసంగిస్తూ.. భారత సంతతి ప్రజలు ఎలాంటి సమస్యలను సృష్టించరని, చట్టాలను ఎంతో గౌరవిస్తారని కొనియాడారు. తన నియోజకవర్గంలోని ప్రతి ఐదుగురు వైద్యుల్లో ఒకరు భారతీయులేనని పేర్కొంటూ.. ఇండో-అమెరికన్లను గొప్ప దేశభక్తులు, ఉన్నతమైన పౌరులు, మంచి మిత్రులుగా అభివర్ణించారు.