అమెరికా, డిసెంబర్ 21: నోటి శుభ్రత, చిగుళ్ల ఆరోగ్యంతో ఇతర వ్యాధులు రాకుండా జాగ్రత్త పడవచ్చని గతంలో వివిధ పరిశోధనలలో తెలిపిన శాస్త్రవేత్తలు… తాజాగా మరో కీలక విషయాన్ని వెల్లడించారు. ఈ మేరకు అమెరికన్ హార్ట్ అసోసియేషన్, కార్డియో వ్యాస్కులర్ డిసీజ్ ప్రివెన్షన్ కమిటీ శాస్త్రవేత్తలు పరిశోధన పత్రాన్ని విడుదల చేశారు. జన్యు శాస్త్ర పరిశోధనలు, క్లినికల్ ట్రయల్స్, ల్యాబ్ పరీక్షల ఫలితాలు, దశాబ్దాల కాలం నాటి పరిశోధక ప్రచురణలను పరిశీలించి ఈ అధ్యయనం నిర్వహించారు.
చిగుళ్ల వ్యాధులు అథెరోస్లెరోటిక్ కార్డియో వాస్క్యులర్ డిసీజ్ (ధమనులు మూసుకుపోవడం) వల్ల కలిగే గుండె సమస్యలు పీరియాంటల్ వ్యాధితో దగ్గర సంబంధం కలిగి ఉన్నాయని తాజా పరిశోధన నివేదికలో స్పష్టం చేశారు. ఇందుకు గల కారణాలను విశ్లేషించారు. దెబ్బ తిన్న చిగుళ్ల ద్వారా శరీరంలోకి బ్యాక్టీరియా ప్రవేశిస్తుందని గుర్తించారు. చిగుళ్లు, నోటి ఆరోగ్యం దెబ్బ తింటే ప్రమాదకరమైన రక్తనాళాల వాపు సమస్య వస్తుందని పేర్కొన్నారు. పొగ తాగడం, వృద్ధాప్యం, ఊబకాయం కారణంగా చిగుళ్ల వ్యాధులు, ధమనులు మూసుకుపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయని వివరించారు.