Commemorative Ornament : అగ్రరాజ్యం అమెరికా (USA) కు రాజధాని నగరమైన వాషింగ్టన్ డీసీ (Washington DC) లో భారీ విజయ తోరణాన్ని నిర్మించేందుకు ఆ దేశ అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సిద్ధమవుతున్నారు. అందుకు సంబంధించిన ప్రణాళికను అమెరికా ప్రభుత్వానికి చెందిన యూఎస్ కమిషన్ ఆన్ ఫైన్ ఆర్ట్స్ శుక్రవారం విడుదల చేసింది. తోరణంపై 250 అడుగుల ఎత్తైన రెక్కల విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఆ విగ్రహం చేతిలో న్యూయార్క్‌లోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చేతిలో ఉన్నట్లుగా కాగడా ఉండనుంది. అదేవిధంగా తలపై కిరీటం ఉంటుంది.
విగ్రహానికి రెండువైపులా రెండు గద్దలు, నాలుగు సింహాల విగ్రహాలు ఉంటాయి. అన్ని విగ్రహాలకు బంగారు పూత వేస్తారు. ఈ తోరణం తూర్పు భాగంలో లింకన్ మెమోరియల్, పశ్చిమ భాగంలో ఆర్లింగ్టన్ జాతీయ శ్మశానవాటిక ఉంటాయి. కొత్త నిర్మాణం పూర్తయితే 99 అడుగుల ఎత్తులో ఉన్న లింకన్ మెమోరియల్ దీనికన్నా చిన్నదిగా కనిపిస్తుంది. భారీ విజయతోరణం ప్రపంచంలోనే అత్యంత గొప్పదైన, అందమైనదిగా నిలుస్తుందంటూ ట్రంప్ సోషల్ మీడియాలో తాజాగా ఒక పోస్ట్ పెట్టారు. వాషింగ్టన్ డీసీ ప్రాంతానికి అది ఒక అద్భుతమైన అదనపు ఆకర్షణగా మారుతుందని అన్నారు. కాగా అమెరికా స్వాతంత్ర్యాన్ని పొంది 250 ఏళ్లవుతున్న సందర్భంగా ఈ భారీ నిర్మాణాన్ని తలపెట్టారు. అమెరికాకు 1776లో స్వాతంత్ర్యం వచ్చింది.