కాబూల్ : అగ్రరాజ్యాలకు ఆఫ్ఘనిస్తాన్ ఆటస్థలంగా మారింది. ఒకరు కాకపోతే ఒకరు వచ్చి తమకు ఇష్టం వచ్చిన రీతిలో ఆడుకుంటూ ప్రైజులు గెలువకుండా సంతోషంగా వెళ్లిపోతున్నారు. పోతూపోతూ తమ అస్త్రశస్త్రాలను (Taliban and Weapons) అక్కడే పడేసి పోతున్నారు. వీటిని తమ గుప్పిట్లోకి తీసుకుంటున్న ఉగ్రవాదులు.. సామాన్యులపైకి చెలరేగుతూ మారణహోమం సృష్టిస్తున్నారు. ఈ క్రీడ 19 వ శతాబ్దం నుంచి కొనసాగుతున్నది. ప్రస్తుతం ఇంటికి తిరుగుముఖం పట్టిన అమెరికా దళాలు.. తమ ఆయుధాలను అక్కడే విడిచి వెళ్లిపోతున్నాయి. దాంతో అత్యాధునిక ఆయుధాలు తాలిబాన్ చేతుల్లోకి వచ్చాయి. వీటిలో ఎం 16 వంటి అత్యంత ఆధునిక తుపాకులు ఉండటం భయంగొల్పుతున్నది.
19 వ శతాబ్దంలో బ్రిటన్, 20 వ శతాబ్దంలో రష్యా, 21 వ శతాబ్దంలో అమెరికా.. ఇలా ఒకరి తర్వాత ఒకరు ఆఫ్ఘనిస్తాన్పై తమ ప్రతాపాన్ని చూపారు. విజయాల మాటేమోగానీ.. ఆపజయాలను మాత్రం మూటగట్టుకున్నాయి. మూడు అగ్రరాజ్యాలు ఇక్కడ ఓటమినే చవిచూశాయంటే.. వారెందుకు వస్తున్నారో, వారేం చేస్తున్నారో అర్థంకాని ప్రశ్నగా మిగిలిపోతున్నది. 1989 లో రష్యన్ దళాలు ఉపసంహరించుకున్న తర్వాత.. ముజాహిదీన్, అనంతరం తాలిబాన్లు టీ-55 ట్యాంకుల మీద రష్యన్ ఏకే 47 తుపాకులతో విహరించడం కనిపించింది. అదే తాలిబాన్ ఫైటర్లు ఇప్పుడు అమెరికన్ సాయుధ సైనిక వాహనాల్లో ఎం 16 రైఫిళ్లతో తిరుగుతున్నారు.
ఫోర్బ్స్ అంచనాల ప్రకారం, ఆఫ్ఘనిస్తాన్‌లో 8,84,311 ఆధునిక సైనిక పరికరాలను అమెరికా వదిలిపెట్టింది. వీటిలో ఎం16 రైఫిల్స్, ఎం4 కార్బన్లు, 82 మిమీ మోర్టార్ లాంచర్లు, హమ్వీ, బ్లాక్ హాక్ హెలికాప్టర్లు, ఏ29 యుద్ధ విమానాలు, రాత్రి వేళ చూసేందుకు ఉపయోగించే పరికరాలు, కమ్యూనికేషన్, నిఘా పదాతిదళ ఆయుధాలు ఉన్నాయి. వీటిలో 75,898 వాహనాలు, యుద్ధట్యాంకులు, 5,99,690 తుపాకులు, 208 వివిధ రకాల విమానాలు ఉండటం విశేషం.
అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ డిపార్ట్మెంట్ ఆఫ్ లాజిస్టిక్స్ ఏజెన్సీ (డీఎల్ఏ) డాటా బేస్ అధ్యయనం ద్వారా ఫోర్బ్స్ ఈ డాటాను సేకరించింది. ఇలాఉండగా, 2017 లో ఆఫ్ఘనిస్తాన్ నేషనల్ ఆర్మీ కోసం తెచ్చిన అమెరికా ఆర్మీకి చెందిన రూ.1,250 కోట్ల విలువచేసే స్కాన్ ఈగల్ డ్రోన్స్ కనిపించడం లేదని తెలుస్తున్నది.
ఏకకాలంలో ఆఫ్ఘన్ సైన్యం, ప్రభుత్వం కూలిపోయిన తర్వాత అమెరికాకు చెందిన అత్యంత ఆధునిక ఆయుధాలు చాలావరకు తాలిబాన్ల చేతిలో పడ్డాయని నిపుణులు చెప్తున్నారు. బలమైన సైన్యాన్ని పెంచడానికి తాలిబాన్‌కు ఈ ఆయుధాలు సరిపోతాయని వారంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్ కోసం కొనుగోలు చేసిన ఆయుధాలు, సైనిక పరికరాల ఆడిట్ నివేదికలను అమెరికా ప్రభుత్వం దాచిపెట్టింది. ఫోర్బ్స్ డాట్ కామ్ ప్రకారం, దీనికి సంబంధించి రెండు ముఖ్యమైన నివేదికలు ప్రభుత్వ వెబ్సైట్ల నుండి తొలగించారు. యూఎస్‌లో ప్రభుత్వ వ్యయానికి సంబంధించిన వాచ్ డాగ్ ఓపెన్ ది బుక్స్.కామ్ (openthebooks.com) ఈ రెండు నివేదికలను తన వెబ్సైట్లో పోస్ట్ చేసింది.
సముద్రం నుంచి అంతరిక్షంలోకి తొలి ఫోన్ కాల్
సబ్ ఖేలే.. సబ్ ఖిలే.. మన్ కీ బాత్‌లో మోదీ
ఇక కొత్తగా వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ
పెండ్లి పందిరిలో పుషప్స్.. వావ్ గ్రేట్!
కొవిడ్ మార్గదర్శకాలు సెప్టెంబర్ 30 వరకు పొడగింపు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..