Census 2027 : దేశంలో జనాభా లెక్కల కోసం కేంద్రం చేపట్టిన జనగణన తొలివిడత కార్యక్రమం ప్రారంభమైంది. ఏప్రిల్ 1, బుధవారం నుంచి ఈ కార్యక్రమం మొదలైంది. ఇది 16వ విడత లెక్కింపు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎనిమిదోది. మొదటిసారిగా దేశంలో జనగణన 1872లో ప్రారంభమైంది. ఇంతకుముందు చివరిసారిగా 2011లో జనాభాను లెక్కించారు. నిజానికి షెడ్యూల్ ప్రకారం 2021లో తిరిగి జనాభా లెక్కింపు ప్రారంభం కావాలి. కానీ, ఆ సమయంలో కోవిడ్ కారణంగా ఇది వాయిదాపడింది.
దీంతో ఇప్పుడు జనగణన కేంద్రం మొదలుపెట్టింది. ఈసారి భారీ మొత్తంలో, సాంకేతికతను ఉపయోగించి డిజిటల్ విధానంలో కూడా జనగణన చేపట్టనుంది. మొదటి దశలో ఇళ్లను లెక్కిస్తారు. ఆ తర్వాత రెండో దశలో జనాభాను లెక్కిస్తారు. ఈ సారి కులగణన కూడా చేపడతారు. వచ్చే ఆరు నెలలపాటు.. అంటే సెప్టెంబర్ వరకు ఇండ్లు, వాటి స్థితి, గృహోపకరణాలు వంటివి లెక్కిస్తారు. మొదటివిడత జనగణనకు రిఫరెన్స్ డేట్ మార్చి 1, 2027. కానీ, జమ్మూ కాశ్మీర్, లడాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి మంచు కురిసే, వాతావరణం అనుకూలించని ప్రాంతాలకు మాత్రం రిఫరెన్స్ డేట్ అక్టోబర్ 1, 2026. అలాగే, వేర్వేరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు తొలి విడత జనగణన వేర్వేరుషెడ్యూల్స్లో ఉంది. రెండో దశ.. అంటే జనాభా లెక్కింపు వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రారంభమవుతుంది. ఎప్పట్లాగే శీతల ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్ వంటి రాష్ట్రాల్లో మాత్రం ఈ ఏడాది సెప్టెంబర్ నుంచే జనగణన ప్రారంభమవుతుంది.
ఈసారి డిజిటల్ పద్ధతిలో కూడా జనగణన చేపడతారు. మొబైల్ యాప్ ద్వారా వివరాలు సేకరిస్తారు. 16 భారతీయ భాషల్లో వివరాలు నమోదు చేయవచ్చు. ఈ జనగణన కోసం కేంద్ర ప్రభుత్వం రూ.11,718 కోట్లు కేటాయించింది. తెలంగాణలో తొలివిడత జనగణన మే 11 నుంచి ప్రారంభమవుతుంది. జూన్ 9 వరకు కొనసాగుతుంది. తొలి విడతలో ఎన్యుమరేటర్లు ప్రజలను 33 ప్రశ్నలు అడుగుతారు. అంటే 33 అంశాలకు సంబంధించి వివరాలు సేకరిస్తారు. జనగణనలో సేకరించే వివరాల్ని రహస్యంగా ఉంచుతారు. జనాభా లెక్కల ఆధారంగా ప్రభుత్వ పథకాల వర్తింపు ఉండదు. ప్రజల నుంచి ఎలాంటి డాక్యుమెంట్లను సేకరించరు. ఈ కార్యక్రమం పూర్తైన తర్వాత పూర్తి వివరాల్ని ప్రభుత్వం వచ్చే ఏడాదే వెల్లడిస్తుంది.