హైదరాబాద్ : ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మూసివేయడాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో టెహ్రాన్ చమురు పరిశ్రమపై ఆంక్షలను కఠినతరం చేస్తున్నట్లు అమెరికా(America) ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశానికి చెందిన ట్రెజరీ డిపార్ట్మెంట్ వివరాలను వెల్లడించింది. ఈ ఆంక్షలు ఇరాన్( Iran) ఇంధన రవాణా మౌలిక సదుపాయాలు, రెండు డజన్లకు పైగా వ్యక్తులు, కంపెనీలు, ఓడలపై ప్రభావం చూపుతాయని ట్రెజరీ డిపార్ట్మెంట్ తెలిపింది. ముఖ్యంగా, సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్ చమురు విక్రయాలకు గతంలో ఇచ్చిన తాత్కాలిక మినహాయింపును అమెరికా రద్దు చేసింది.
ఇరాన్ ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ను బందీగా మార్చడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఆ దేశం ఆదాయాన్ని ఆర్జించే సామర్థ్యాన్ని నిర్ణయాత్మకంగా కట్టడి చేసే దిశగా అమెరికా చర్యలు చేపడుతోంది అని అమెరికా విదేశాంగ శాఖ ఒక ప్రత్యేక ప్రకటనలో పేర్కొంది. ఇరాన్ ప్రజల ఖర్చుతో లాభపడాలని చూస్తున్న షమ్ఖానీ కుటుంబం వంటి ఉన్నత పాలక వర్గాలను లక్ష్యంగా చేసుకుని ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, కొద్ది రోజుల క్రితం ఇరాన్ చమురు అమ్మకాలపై 30 రోజుల తాత్కాలిక మినహాయింపు ఇచ్చినప్పటికీ, తాజా పరిణామాలతో అమెరికా మళ్లీ కఠిన వైఖరిని అవలంబిస్తుండటంతో భారత్ వంటి దేశాల రిఫైనరీలు ఇరాన్ నుండి చమురును కొనుగోలు చేయడం కష్టతరం కానున్నది.