America | వాషింగ్టన్, డిసెంబర్ 29: అమెరికాలో మళ్లీ వింత వస్తువులు ఆకాశంలో సంచరించటం తీవ్ర కలకలం రేపింది. ఆ దేశ గగనతలంలో అంతుచిక్కని డ్రోన్ల సంచారం ఇటీవల మిస్టరీగా మారింది. ఇవి కనిపించిన ప్రాంతంలోనే తాజాగా ఆకాశంలో గోళాకారంలోని ఎర్రటి వస్తువులు సంచరించటం కొంతమంది కంటపడ్డాయి. తమకు ఆకాశంలో ‘రెడ్ ఆర్బిట్స్’ కనిపించాయని తూర్పు అమెరికాలో పలువురు చెప్పటం సంచలనంగా మారింది. న్యూజెర్సీ మీదుగా వెళ్తున్న ‘రెడ్ ఆర్బిట్స్’ అంటూ ఒకరు ‘ఎక్స్’లో వీడియోను షేర్ చేశారు.
న్యూయార్క్‌లోని జేఎఫ్‌కే ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తున్న ప్రయాణికుడు ‘రెడ్ ఆర్బిట్స్’ను వీడియో తీశాడంటూ ‘ద మిర్రర్’ కథనం పేర్కొన్నది. ‘లాస్ వెగాస్ నుంచి న్యూయార్క్ వెళ్తుండగా ఆ రోజు (డిసెంబర్ 27న) రాత్రి 9.30 గంటలకు న్యూజెర్సీ మీదుగా రెండు ‘రెడ్ ఆర్బిట్స్’ను చూశాను’ అని డీజే నార్కట్టా అనే యూజర్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశాడు. ‘ఆకాశంలో నిశ్శబ్దంగా సంచరిస్తున్న ‘రెడ్ ఆర్బిట్స్’. ఇవి నిజమైన ‘యుఎఫ్‌వో’లు కాదంటూ ప్రభుత్వం మనకు చెబుతున్నది’ అంటూ పలువురు సోషల్‌మీడియాలో సందేశాలు పోస్ట్ చేశారు.