రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించాలి. అన్ని దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాలి. ఎవ్వరూ ఆ దేశం నుంచి చమురు కొనుగోళ్లు చేయవద్దు. ఆ దేశాన్ని అన్ని రకాలుగా బంధించాలి.. ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధ సమయంలో అమెరికా చేసిన వ్యాఖ్యలివి. తూచ్… ఇవన్నీ ఒఠ్ఠి మాటలే అని తేలిపోయింది. తన దాకా వస్తే గానీ తత్వం బోధపడదని ఓ సామెత. రష్యాకు ఏ రకమైన సహాయమూ చేయవద్దని పదే పదే బీరాలకు పోయిన అమెరికా.. ఇప్పుడేం చేసిందో తెలిస్తే.. అందరూ నివ్వెర పోవడం ఖాయం.
రష్యాపై ఆంక్షలు విధించాలని ఓ వైపు అంటూనే.. మరో వైపు అమెరికా.. రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తూనే వుంది. ఇలా కొనుగోలు చేస్తూ.. తమ ఆర్థిక వ్యవస్థను అమెరికా పరిపుష్టం చేస్తోందని రష్యా తాజాగా ప్రకటించింది. రష్యా రక్షణ పరిషత్ ఉప కార్యదర్శి మైఖేల్ పోపోవ్ ఈ విషయాన్ని వెల్లించారు. గత వారం రోజుల్లోనే ఏకంగా 43 శాతం అగ్రరాజ్యం తమ నుంచి చమురు కొనుగోలు చేసిందని ఆయన బాంబు పేల్చారు. ప్రతి రోజూ అమెరికా రష్యా నుంచి లక్ష బ్యారెళ్ల ముడి చమురు కొనుగోలు చేస్తోందని పేర్కొన్నారు.కేవలం ముడి చమురు మాత్రమే కాకుండా ఖనిజాలు, ఎరువులు కూడా కొనుగోలు చేయడానికి అమెరికా తమ కంపెనీలకు అనుమతినిచ్చిందని పోపోవ్ వెల్లడించారు.