Elections | వాషింగ్టన్, ఫిబ్రవరి 16: మన దేశ ఎన్నికల ప్రక్రియలో అమెరికా జోక్యం చేసుకునేందుకు యత్నించిందా? దేశంలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు మునుపటి బైడెన్ సర్కారు 21 మిలియన్ డాలర్లు కేటాయించడం, తాజాగా ట్రంప్ సర్కారు వాటిని నిలిపివేయడం చర్చనీయాంశంగా మారింది. భారత్లో ఓటర్ల సంఖ్యను పెంచడానికి అమెరికా ప్రభుత్వం అందజేసే 21 మిలియన్ డాలర్లను ఇక నుంచి నిలిపివేస్తున్నట్టు ట్రంప్ యంత్రాంగంలో కీలక పాత్ర పోషిస్తున్న మస్క్ నేతృత్వంలోని డోజ్ విభాగం ప్రకటించింది. ‘అమెరికా పన్ను చెల్లింపుదారులు చెల్లించే ప్రతి డాలర్ సొంతానికి మాత్రమే కేటాయిస్తాం. మిగిలినవన్నీ రద్దు చేస్తున్నాం’ అని ప్రకటించింది.
అమెరికా నిధులపై బీజేపీ ప్రతినిధి అమిత్ మాలవీయ స్పందించారు. ఇది కచ్చితంగా భారతదేశ ఎన్నికల ప్రక్రియలో బయటి శక్తులు జోక్యం చేసుకోవడమేనని అన్నారు. ‘ఈ నిధుల వల్ల ఎవరికి ప్రయోజనం జరిగింది? కచ్చితంగా అధికార బీజేపీకి అయితే కాదు’ అని ఆయన స్పష్టం చేశారు. గత యూపీఏ ప్రభుత్వం దేశ ప్రయోజనానికి భంగం కలిగించే వ్యతిరేక శక్తులు భారత సంస్థలలోకి చొరబడటానికి వీలు కల్పించిందని ఆయన ఆరోపించారు. మన ఎన్నికల ప్రక్రియపై అమెరికా కేంద్రంగా ఉండే బిలియనీర్, కాంగ్రెస్, గాంధీల కుటుంబ సన్నిహితుడు జార్జి సోరోస్ నీడ అలుముకోవడాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
భారతదేశ ఎన్నికల కమిషనర్ నియామక ప్రక్రియ పారదర్శకంగా, అందరినీ కలుపుకుని సాగిందని, అప్పట్లో భారత ఎన్నికల ప్రక్రియ విదేశీ ఆపరేటర్లకు అప్పగించారనడంలో ఎలాంటి సందేహం లేదని ఆయన ఆరోపించారు. అయితే దీనిని కాంగ్రెస్ వర్గాలు ఖండించాయి. తన వైఫల్యాలను దాచుకోవడానికి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నదని పేర్కొన్నాయి.