వాషింగ్టన్ : అమెరికా ప్రభుత్వ చరిత్రలోనే అతిపెద్ద సామూహిక రాజీనామాకు రంగం సిద్ధమైంది. అధ్యక్షుడు ట్రంప్ తీసుకొచ్చిన డిఫర్డ్ రిజిగ్నేషన్ ప్రోగ్రాంలో భాగంగా మంగళవారం నుంచి లక్ష మందికి పైగా ఫెడరల్ ఉద్యోగులు విధులకు దూరమయ్యే అవకాశం ఉంది. ఈ కార్యక్రమం మొత్తం 2,75,000 మంది ఉద్యోగులపై ప్రభావం చూపుతుందని వైట్‌హౌస్ ప్రతినిధి వెల్లడించారు. ఈ రాజీనామా పథకం కింద 2 లక్షల మంది ఉద్యోగులు పని చేయకుండానే ఎనిమిది నెలల వరకు పూర్తి జీతభత్యాలు పొందే అవకాశం ఉంది.
సెనేట్ డెమొక్రాట్ల నివేదిక ప్రకారం, ఈ కార్యక్రమానికి 14.8 బిలియన్ డాలర్ల వ్యయం అవుతుంది. అయితే, దీర్ఘకాలంలో ఇది ఏటా 28 బిలియన్ డాలర్లు ఆదా చేస్తుందని, చరిత్రలోనే ఇది అత్యంత సమర్థవంతమైన ఉద్యోగుల తగ్గింపు ప్రణాళిక అని పరిపాలన అధికారులు వాదిస్తున్నారు. ఉద్యోగులకు ఎలాగూ జీతాలు చెల్లించాల్సి ఉన్నందున, ప్రభుత్వానికి అదనపు భారం లేదని శ్వేతసౌధం పేర్కొంది. ఈ రాజీనామా కార్యక్రమంపై కార్మిక సంఘాలు కోర్టులో దావా వేశాయి.