వాషింగ్టన్, నవంబర్ 23 : వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను గద్దె దించడానికి అమెరికా తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది. రానున్న కొద్ది రోజుల్లో వెనిజువెలా లక్ష్యంగా అమెరికా కొత్త తరహా ఆపరేషన్లు నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నదని, నికోలస్‌ను గద్దె దించడమే లక్ష్యంగా వాషింగ్టన్ తన ప్రయత్నాలను తీవ్రం చేసిందని నలుగురు ఉన్నతాధికారులు రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపారు. ట్రంప్ సర్కారు ఆ దేశ రాజధాని కారకాస్‌పై ఒత్తిడి పెంచుతూ కరేబియన్‌లో తన సైనిక ఉనికిని విస్తరించిందని వారు తెలిపారు. ఇది ఘర్షణలకు దారితీసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఇద్దరు అధికారుల కథనం ప్రకారం.. కొత్త వ్యూహంలోని మొదటి దశ ప్రకారం కోవర్ట్ ఆపరేషన్లు నిర్వహిస్తారు. మదురోను గద్దె దింపేందుకు చర్చల విధానాన్ని కూడా వారు అనుసరిస్తారని పేర్కొన్నారు. కాగా, ఇప్పటికే వెనిజువెలా సముద్ర జలాల్లో అమెరికా మిలిటరీ పెద్దయెత్తున తిష్టవేసి, ఏ క్షణంలోనైనా దాడి జరపడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే కనీసం ఏడు యుద్ధ నౌకలు, ఒక నూక్లియర్ సబ్‌మెరైన్, ఎఫ్-35 పైటర్ విమానం, యూఎస్ నేవీ అది పెద్ద ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ మోహరించి ఉన్నాయి. అయితే వెనిజువెలాకు చైనా, రష్యాలు మద్దతుగా ఉండటంతో దాడికి ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి తటపటాయిస్తున్నారని భావిస్తున్నారు.