వాషింగ్టన్: అమెరికాలో గుడ్ల ధరలు చూసి ప్రజలు గుడ్లు తేలేస్తున్నారు. మునుపెన్నడూ లేని రీతిలో అక్కడ ఎగ్స్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో 60.4 శాతం పెరుగుదల కనిపించింది. ప్రస్తుతం డజను గుడ్ల ధర 6.22 డాలర్లు (సుమారు రూ.536)గా ఉంది. ఏవియన్ ఫ్లూ లక్షణాలు కనిపించిన వెంటనే లక్షలాది కోళ్లను చంపేశారు.
దీంతో ఇప్పుడు గుడ్లను పెట్టే కోళ్లు తగ్గిపోయాయి. జనవరిలో డజను గుడ్ల ధర 4.95 డాలర్లు కాగా, ఫిబ్రవరిలో 19.2 శాతం పెరిగి 5.90 డాలర్లకు చేరింది. 2024వ సంవత్సరం ప్రారంభం నాటి ధరతో పోల్చుకుంటే ఇప్పుడు 84 శాతం పెరుగుదల నమోదైంది. 2023 జనవరిలో డజను గుడ్ల ధర రికార్డు స్థాయిలో 4.82 డాలర్లకు చేరగా, ఇప్పుడు ఆ రికార్డు చెరిగిపోయింది.