వాషింగ్టన్: వెనెజువెలా అధ్యక్షుడు మదురో, ఆయన భార్యను అమెరికా బంధించి తీసుకెళ్లడంతో వెనెజువెలా భవితవ్యం ఏమిటన్నది ఆసక్తిగా మారింది. ఉపాధ్యక్షురాలు డెల్ఫీ రోడ్రిగ్స్‌ను తాత్కాలిక అధ్యక్షురాలిగా ఆ దేశ సుప్రీంకోర్టు నియమించింది. అయితే మదురోయే తమ దేశ ఏకైక అధ్యక్షుడని పేర్కొన్న ఆమె.. అతడిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఆమెను అమెరికా ఆ పదవిలో కొనసాగించే పరిస్థితి కన్పించడం లేదు. వెనెజువెలాను తామే పాలిస్తామని ట్రంప్ ప్రకటించినప్పటికీ, అది ఏ విధంగా అన్నదానిపై మాత్రం స్పష్టత లేదు. ట్రంప్ వ్యాఖ్యలకు విరుద్ధంగా విదేశాంగ మంత్రి మార్కో రుబియో వ్యాఖ్యానించడం గమనార్హం.
రుబియో ఆదివారం మాట్లాడుతూ, వెనెజువెలాలో ప్రభుత్వం నిర్వహించే రోజువారీ కార్యకలాపాలను అమెరికా నిర్వహించదని చెప్పారు. వెనెజువెలాపై ప్రస్తుత ఆయిల్ క్వారంటైన్‌ను మాత్రం కొనసాగిస్తామని తెలిపారు. ఈ విధానాన్ని ఉపయోగించుకుని ఆ దేశంలో విధానాల మార్పు కోసం ఒత్తిడి తెస్తామన్నారు. ట్రంప్ చెప్పిన నియంత్రణ అదేనన్నారు. ప్రజల ప్రయోజనం కోసం చమురు పరిశ్రమ నడిచేవిధంగా, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఆగిపోయే విధంగా మార్పులు రావాలన్నారు. సీబీఎస్ టీవీ షోలో రుబియో ఈ వ్యాఖ్యలు చేశారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు చేపట్టగా, ఆమెకు మద్దతుగా నిలబడతామని ఆ దేశ మిలటరీ ప్రకటించింది. మదురో స్థానంలో ఆమెను తాత్కాలిక అధ్యక్షురాలిగా గుర్తిస్తున్నట్టు మిలిటరీ ప్రకటించింది.