న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: అమెరికాలో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (స్టెమ్) కోర్సులు చదువుతున్న భారతీయులతో సహా ఇతర దేశాల విద్యార్థులకు కొత్త భయం వెన్నాడుతోంది. చదువులు పూర్తయిన వెంటనే స్వదేశాలకు తిరిగివెళ్లే పరిస్థితి వారికి ఎదురయ్యే అవకాశం ఉంది. ఆప్షనల్ ప్రాక్టికల్ ్రట్రైనింగ్ (ఓపీటీ) వర్క్ ఆథరైజేషన్‌ని రద్దు చేయాలని కోరుతూ పార్లమెంట్లో ఓ బిల్లును కొందరు సభ్యులు ప్రవేశపెట్టారు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఉద్యోగం వెదుక్కునేందుకు మూడేళ్ల వరకు అమెరికాలో నివసించే అవకాశాన్ని ఓపీటీ కల్పిస్తోంది.
గతంలో అటువంటి ప్రయత్నాలు విఫలమైనప్పటికీ ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన ఇమిగ్రేషన్ చర్యల నేపథ్యంలో ఈ బిల్లు రావడం విదేశీ విద్యార్థులను భయాందోళనకు గురిచేస్తోంది. ఎన్నికల్లో చేసిన వాగ్దానం మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే విదేశీ అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపించే కార్యక్రమాన్ని చేపట్టారు. తాజా పరిణామంతో తమను హెచ్1-బీ వర్క్ వీసాదారులుగా మార్చగల ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటున్న ఎఫ్-1, ఎం-1 స్టూడెంట్ వీసాదారుల్లో భయాందోళనలు మొదలయ్యాయి.
ఓపెన్ డోర్స్ నివేదిక ప్రకారం 2023-24 విద్యా సంవత్సరంలో అమెరికాలో 3 లక్షల మందికిపైగా భారతీయ విద్యార్థులు ఉన్నారు. వీరిలో మూడో వంతు మంది ఓపీటీ పొందేందుకు అర్హులు. ఓపీటీ కింద విద్యార్థులు తమ గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఒక ఏడాది పాటు ఉద్యోగాన్వేషణ కోసం అమెరికాలోనే కొనసాగవచ్చు. ఒకవేళ స్టెమ్ గ్రాడ్యుయేట్ అయ్యుండి, క్వాలిఫైడ్ అమెరికా కంపెనీలో పనిచేస్తుంటే దీన్ని మరో రెండేళ్ల వరకు పొడిగించవచ్చని ఇమిగ్రేషన్ న్యాయ సలహా సంస్థకు చెందిన పూర్వీ చోతాని తెలిపారు. ఈ బిల్లు ఆమోదం పొందిన పక్షంలో మరో వర్క్ వీసాకు మారేందుకు అవకాశం లేకుండా అర్ధాంతరంగా ఓపీటీ ముగిసిపోతుందని ఆమె తెలిపారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం స్టెమ్ కాని గ్రాడ్యుయేట్లు ఏడాది తర్వాత అమెరికాను వీడాల్సి ఉంటుంది. ఓపీటీ వీసా హోల్డర్లు సాధ్యమైనంత త్వరగా హెచ్-1బీకి బదిలీ కావలసి ఉంటుంది. ఇక కొత్తగా చేరుతున్న విద్యార్థులు తమ చదువులు పూర్తయిన వెంటనే దేశాన్ని వీడాల్సిన బ్రిటన్ తరహా చట్టాలను ఎదుర్కొనడానికి అమెరికాలో కూడా సంసిద్ధంగా ఉండాలని ఆమె తెలిపారు.
ఓపీటీ రద్దు అవుతుందన్న భయం భారతీయ విద్యార్థులను పట్టిపీడిస్తోందని స్టడీ అబ్రాడ్ ప్లాట్‌ఫామ్ కాలేజిఫై సహ వ్యవస్థాపకుడు ఆదర్శ్ ఖండేల్వాల్ అన్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా లీగల్ వెబినార్లు, ఇమిగ్రేషన్ చర్చా వేదికలే కనపడుతున్నాయని ఆయన చెప్పారు. అమెరికాకు తిరిగిరాక కష్టమవుతుందన్న భయంతో చాలా మంది భారతీయ విద్యార్థులు ఈ వేసవిలో భారత్‌కు వెళ్లాలన్న తమ ఆలోచనను విరమించుకుంటున్నారు. వేసవి సెలవుల కోసం దేశాన్ని విడిచి వెళ్లవద్దని కార్నెల్, కొలంబియా, యాలే యూనివర్సిటీలు తమ విదేశీ విద్యార్థులకు అధికారికంగా సలహా ఇచ్చాయి.
భారతీయ విద్యార్థులు ఇప్పటికీ అమెరికానే తమ గమ్యస్థానంగా భావిస్తున్నారు. అయితే ట్రంప్ ప్రభుత్వం వీసా నిబంధనలను కఠినతరం చేయడంతో ప్రత్యామ్నాయంగా కెనడా, యూరప్‌ను ఎంచుకుంటున్నారు. రానున్న 2025, 2026 బ్యాచుల కోసం అమెరికాయేతర దేశాలకు దరఖాస్తు చేసుకున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 20 శాతం పెరిగినట్టు నిపుణులు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తుకు భరోసాను కోరుకుంటున్నారని వారు చెప్పారు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత సంపాదన అవకాశాలను విద్యార్థుల కుటుంబాలు ఆశిస్తున్నాయి. అయితే అమెరికాలో చదువు చవకేమీ కాదు. అమెరికాలో చదువుకోవాలంటే ప్రతి విద్యార్థికి ఏడాదికి కనీసం రూ. 51.72 లక్షలు ఖర్చవుతాయని ఖండేల్వాల్ తెలిపారు.