వాషింగ్టన్, జనవరి 5: ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాల ఊచకోత 2023లోనూ కొనసాగనున్నది. గత నవంబర్లో 11వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపించిన ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఈ ఏడాది కూడా వేటు వేసేందుకు సిద్ధమవుతున్నది. ఈ కొత్త సంవత్సరంలో తమ కంపెనీలోని 18 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకనున్నట్టు ప్రకటించింది. కొవిడ్ సమయంలో చాలామంది ఉద్యోగులను నియమించుకొన్నామని, అనిశ్చిత పరిస్థితుల కారణంగా వారిని తొలగిస్తున్నామని అమెజాన్ సీఈవో ఆండీ జెస్సీ తెలిపారు. అమెజాన్ స్టోర్స్, పీఎక్స్టీ ఆర్గనైజేషన్స్ నుంచి ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించారు. ఇక ప్రముఖ టెక్ కంపెనీ ‘సేల్స్ఫోర్స్’ కూడా అమెజాన్ బాటలోనే నడుస్తున్నది. ఈ ఏడాది తమ కంపెనీలోని 8 వేల మందిని (10శాతం) ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించింది. అలాగే, కొన్ని కార్యాలయాలను కూడా మూసివేస్తున్నట్టు తెలిపింది.