Israel-Iran | ఇజ్రాయెల్, ఇరాన్ (Israel-Iran) మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరడంతో పశ్చిమాసియా భగ్గుమంటోంది. తాజా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పశ్చిమాసియా దేశాల కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇజ్రాయెల్ దళాలు పెద్ద ఎత్తున క్షిపణి దాడులకు పాల్పడుతుండటంతో.. తమ గగనతలాన్ని పలు దేశాలు మూసివేశాయి.
ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ తన గగనతలాన్ని పూర్తిగా మూసివేసిన విషయం తెలిసిందే. తాజాగా లెబనాన్, జోర్దాన్, ఇరాక్ దేశాలు కూడా విమానాల రాకపోకలను నిలిపివేశాయి (Airports close across Middle East). ఈ చర్యతో పశ్చిమాసియా వ్యాప్తంగా ఎయిర్‌పోర్ట్‌లు మూతపడ్డాయి. దీంతో వేలాది మంది ప్రయాణికులు అక్కడ చిక్కుకుపోయారు. దాదాపు 10 వేల మందికిపైగా ప్రజలు పశ్చిమాసియా దేశాల్లో చిక్కుకుపోయినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
మరోవైపు ఇజ్రాయెల్ సైతం తమ దేశంలోని అత్యంత కీలకమైన బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేసింది. తదుపరి నోటీసులు వచ్చే వరకూ ఆంక్షలు కొనసాగుతాయని తెలిపింది. దీంతో దాదాపు 50 వేల మందికిపైగా ఇజ్రాయెల్ ప్రయాణికులు విదేశాల్లో చిక్కుకున్నారు. మరోవైపు ఇరాన్ దాడులు కొనసాగుతుండటంతో దేశంలోని మూడు విమానయాన సంస్థలకు చెందిన జెట్ విమానాలను లార్నాకాకు తరలించారు. ఇజ్రాయెల్ పౌరులు జోర్డాన్, ఈజిప్ట్‌లతో ఉన్న సరిహద్దుల ద్వారా దేశం విడిచి వెళ్లవద్దని, ఆ ప్రాంతాల్లో ప్రమాదం పొంచి ఉందని ప్రధాని నెతన్యాహు హెచ్చరికలు జారీ చేశారు.
Also Read..
Israel-Iran | ఇజ్రాయెల్ దాడులు.. ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ సన్నిహితుడు మృతి
Israel-Iran | టెహ్రాన్ ఎయిర్‌పోర్ట్‌పై ఇజ్రాయెల్ దాడి.. రెండు ఇరానియన్ F-14 యుద్ధ విమానాలు ధ్వంసం
Indian Students | ఇరాన్ నుంచి అర్మేనియా చేరుకున్న 110 మంది భారతీయ విద్యార్థులు.. రేపు ఢిల్లీకి