WEF | దావోస్, జనవరి 18: ప్రపంచ ఉద్యోగ మార్కెట్‌ను కృత్రిమ మేధ(ఏఐ) తీవ్రంగా ప్రభావితం చేస్తున్న తరుణంలో ఊహించిన దాన్ని కన్నా వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ప్రస్తుతమున్న నైపుణ్యాల్లో 39 శాతం 2030 నాటికి పనికి రాకుండా పోతాయని ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) అంచనా వేసింది. డబ్ల్యూఈఎఫ్ తాజా నివేదిక ప్రకారం ఏఐకు అనుగుణంగా తమ వ్యాపారాలను తీర్చిదిద్దుకోవాలని సగం కంపెనీలు నిర్ణయించుకోగా.. మూడింట రెండొంతుల కంపెనీలు ఏఐ నైపుణ్యాలు కలిగిన వారిని ఉద్యోగులుగా నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకొన్నాయి.
ఇదే సమయంలో ఆటోమేషన్ కారణంగా తమ శ్రామిక శక్తిలో 40 శాతం మందిని తగ్గించుకోవాలని ప్రణాళికలు వేసుకొంటున్నాయి. డబ్ల్యూఈఎఫ్ ఉద్యోగాల భవిష్యత్తు నివేదిక-2025 ప్రకారం రానున్న అయిదేండ్లలో క్లరికల్, సచివాలయ ఉద్యోగాలు వేగంగా తగ్గిపోతాయి. అడ్మిన్ అసిస్టెంట్స్, టికెట్ క్లర్క్స్, క్యాషియర్స్ వంటి ఉద్యోగాలను ఏఐ ఆధారిత టూల్స్, ఆటోమేషన్ భర్తీ చేస్తాయి.
అదే సమయంలో మనుషుల ప్రమేయం తప్పనిసరైన బట్వాడా, నిర్మాణం, ఆహార ప్రాసెసింగ్, వ్యవసాయ రంగాల్లో ఉద్యోగాల సంఖ్య పెరుగుతుంది. నర్సింగ్, సంఘ సేవ, వ్యక్తిగత సంరక్షణ లాంటి సేవా రంగాల్లోనూ కొలువులు ఎక్కువవుతాయి. పెరుగుతున్న జీవన వ్యయం 16 లక్షల ఉద్యోగాల తొలగింపునకు కారణం కావొచ్చు. వాణిజ్య ఆంక్షలు, ఆర్థిక సవాళ్లు ప్రపంచ శ్రామిక మార్కెట్‌ను పునర్ నిర్వచించడంపై ఒత్తిడి తెస్తాయి. ఉద్యోగాల తొలగింపు, సృష్టికి మధ్య 2030 నాటికి 7.8 కోట్ల ఉద్యోగాల్లో వృద్ధి కనిపిస్తుందని.. అత్యాధునిక నైపుణ్యాలను అన్వయించుకోవడం భవిష్యత్తు కార్మిక శక్తిపై ప్రభావం చూపిస్తుందని నివేదిక అంచనా వేసింది.