లండన్: ఏఐ టూల్స్ మనం ఏ ప్రశ్న అడిగినా జవాబు చెప్తాయి. ఇందుకు మనం డబ్బు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. అయినా కంపెనీలు వందల కోట్లు ఖర్చు పెట్టి వీటిని తయారుచేస్తున్నాయి. దీని వెనుక ఆయా కంపెనీలకు ప్రత్యేక లక్ష్యాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి.
ఏఐ చాట్బాట్లు, టూటర్లు, ఏజెంట్లు, గర్ల్‌ఫ్రెండ్స్ వంటి ఏఐ టూల్స్ మనల్ని అర్థం చేసుకొని మన నిర్ణయాలను ప్రభావితం చేస్తాయని ఈ అధ్యయనం వెల్లడించింది. ఏఐ టూల్స్‌కు ప్రశ్నలు, సంభాషణల రూపంలో మనం ఇచ్చే సమాచారాన్ని బట్టి అవి మన ఆలోచనలను, ప్రవర్తనను పసిగట్టగలవని పరిశోధకులు తెలిపారు. ఈ సమాచారం ద్వారా ప్రకటనకర్తలు విక్రయించాలనుకునే ఉత్పత్తులు కొనేలా మనల్ని ఏమార్చగలవని చెప్పారు. ఈ రకమైన కాన్సెప్ట్‌ను ‘ఇంటెన్షన్ ఎకానమీ’గా పేర్కొంటున్నారు.