బెర్లిన్: ఇరాన్ నుంచి వచ్చిన విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఈ నేపథ్యంలో జర్మనీలోని హాంబర్గ్ ఎయిర్‌పోర్ట్‌లో విమాన రాకపోకలను రద్దు చేశారు. (flights suspend) ఇరాన్ నుంచి జర్మనీకి ప్రయాణించిన ఒక విమానంలో బాంబు ఉన్నట్లు ఆ దేశ పోలీసులకు ఈమెయిల్ అందింది. ఈ నేపథ్యంలో హాంబర్గ్ విమానాశ్రయంలో విమాన రాకపోకలను నిలిపివేశారు. మరో నగరంలోని విమానాశ్రయానికి ఆ విమానాన్ని మళ్లించారు. అక్కడ ల్యాండింగ్ తర్వాత బాంబ్ స్క్వాడ్ బృందాలు ఆ విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో హాంబర్గ్ విమానాశ్రయంలో విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌ను నిలిపివేసినట్టు ఆ ఎయిర్పోర్ట్ వెబ్సైట్లో పేర్కొన్నారు. భద్రతా కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
కాగా, జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, సోమవారం హాంబర్గ్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారి తొలి రోజు భేటీ సందర్భంగా ఈ సంఘటన జరిగింది. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పాలస్తీనాలోని గాజాలో ఆధిపత్యం చెలాయిస్తున్న హమాస్‌కు ఇరాన్ మద్దతిస్తున్నది. ఈ నేపథ్యంలో ఇరాన్ నుంచి జర్మనీకి ప్రయాణించిన విమానంలో బాంబు ఉన్నట్లు పోలీసులకు ఈమెయిల్ బెదిరింపు రావడం కలకలం రేపింది.