పశ్చిమాసియా రగులుతున్నది. యుద్ధం మరిన్ని దేశాలకు విస్తరిస్తుండటం కలవరపరుస్తున్నది. హమాస్-ఇజ్రాయెల్ యుద్ధంతో మొదలైన ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. హమాస్‌కు మద్దతుగా ఎర్ర సముద్రంలో నౌకలే లక్ష్యంగా హౌతీల దాడులు, ప్రతిగా హౌతీ స్థావరాలపై అమెరికా, బ్రిటన్ విరుచుకుపడటం.. తాజాగా ఇరాక్, సిరియా, పాకిస్థాన్‌లపై ఇరాన్ వరుస దాడులకు దిగడం పశ్చిమాసియాను కుదిపేస్తున్నది. గత రెండు సంవత్సరాలుగా ఉక్రెయిన్-రష్యా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో తాజా పరిణామాలు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయా? అన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
West Asia | టెహ్రాన్, జనవరి 17: దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతున్నది. పలు దేశాల్లో నిత్యం బాంబుల మోత మోగుతుండటంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. హమాస్-ఇజ్రాయెల్ యుద్ధంతో మొదలైన ఉద్రిక్తతలు.. తాజాగా ఇతర దేశాలకూ విస్తరించాయి. తాజాగా పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రాంతంలో ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ మంగళవారం దాడులు చేసింది.
సున్నీ మిలిటెంట్ గ్రూపు జైష్ అల్ అదిల్‌కు చెందిన రెండు ప్రధాన స్థావరాలపై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. దీనిపై పాకిస్థాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరాన్ తమ గగనతల ఉల్లంఘనకు పాల్పడిందని, దాడుల్లో ఇద్దరు చిన్నారులు మరణించారని పేర్కొన్నది. తమ దేశంలోని ఇరాన్ రాయబారిని కూడా బహిష్కరిస్తున్నట్టు బుధవారం వెల్లడించిన పాక్.. అలాగే ఆ దేశంలో ఉన్న తమ రాయబారిని కూడా వెనక్కు పిలిపించుకొన్నది. ఇరాన్ చర్యలకు తీవ్ర పరిణామాలు ఉంటాయని పాక్ విదేశాంగ శాఖ హెచ్చరించింది.
క్షిపణి శక్తిని ఉపయోగిస్తాం
ఇరాన్ దాడుల తర్వాత పాకిస్థాన్, ఆఫ్గానిస్థాన్‌తో సరిహద్దులు పంచుకొనే సిస్తాన్ ప్రావిన్స్‌లో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్(ఐఆర్జీ)కి చెందిన సభ్యుడిని గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపడం సంచలనంగా మారింది. మరోవైపు శత్రువులను ఎదుర్కొనేందుకు తమ క్షిపణి శక్తిని వినియోగించుకోవడానికి ఎంత మాత్రం వెనుకాడబోమని ఇరాన్ రక్షణ శాఖ మంత్రి మహ్మద్ రేజా స్పష్టం చేశారు.
దాడులకు ప్రతిదాడులు..
హమాస్-ఇజ్రాయెల్ యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. హమాస్‌కు ఇరాన్, యెమెన్ హౌతీలు మద్దతుగా ఉంటున్నాయి. ఎర్రసముద్రంలో అమెరికా, మిత్రదేశాల వాణిజ్య నౌకలపై హౌతీలు వరుస దాడులకు పాల్పడుతున్నారు. హెచ్చరికలను పెడచెవిన పెట్టడంతో యెమెన్‌లోని హౌతీ సైనిక స్థావరాలపై గత వారం అమెరికా, బ్రిటన్ క్షిపణులతో దాడులు చేశాయి. దాడికి ప్రతిదాడి అన్నట్టుగా హౌతీలు తాజాగా సోమవారం యెమెన్ తీరంలోని గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌లో అమెరికా నౌకపై యాంటీ షిప్ క్షిపణితో దాడి చేశారు. ఈ నేపథ్యంలో హౌతీలను మళ్లీ గ్లోబల్ టెర్రరిస్టు జాబితాలో చేరుస్తూ బైడెన్ సర్కార్ బుధవారం నిర్ణయం తీసుకొన్నదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఏమిటీ జైష్ అల్ ఆదిల్?
పాక్‌పై దాడుల్లో భాగంగా ఇరాన్ తాజాగా టార్గెట్ చేసుకొన్న ఉగ్రవాద గ్రూపు ‘జైష్ అల్ ఆదిల్’పై ప్రస్తుతం చర్చ నడుస్తున్నది. 2012లో స్థాపించబడిన ఈ సంస్థ 2013లో దాడి చేసి 14 మంది ఇరాన్ గార్డులను చంపడంతో వార్తల్లోకి వచ్చింది. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తూ ఇరాన్‌లోని సిస్థాన్-బలూచిస్థాన్‌లో తన కార్యకలాపాలను నిర్వహిస్తున్నది. తన ఉనికిని చాటుకొనే ప్రయత్నంలో భాగంగా ఇరాన్ సరిహద్దుల్లో పోలీసులు, జవాన్లను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడింది. వరుసగా పలు హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న క్రమంలో ఈ గ్రూపును ఇరాన్ తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలో తాజాగా జైష్ అల్ ఆదిల్ స్థావరాలపై దాడులకు పాల్పడింది. ప్రస్తుతం పాక్ చెరలో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ను ఈ గ్రూపే కిడ్నాప్ చేసి, పాక్ గూఢచర్య సంస్థకు విక్రయించిందని కూడా నిఘా వర్గాల సమాచారం
హమాస్-ఇజ్రాయెల్ యుద్ధంలోకి ఇరాన్!

Sraeli
హమాస్-ఇజ్రాయెల్ యుద్ధంలో ఇప్పటికే వేలాది మంది మరణించారు. ఈ యుద్ధం ఇప్పట్లో ముగిసే సంకేతాలు ఏవీ కనిపించడం లేదు. ఇప్పటి వరకు తాము మద్దతిచ్చే మిలిటెంట్ గ్రూపులతో దాడులు చేయించిన ఇరాన్.. ఇప్పుడు హమాస్-ఇజ్రాయెల్ యుద్ధ రంగంలోకి నేరుగా దిగినట్టు కనిపిస్తున్నది. ఇరాక్, సిరియాలపై సోమవారం క్షిపణులతో దాడులు చేసింది. ఉత్తర ఇరాన్‌లోని ఇర్బిల్‌లో ఉన్న ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్‌కు చెందిన ముఖ్య కార్యాలయంపై బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. మరోవైపు సిరియాలోని ఐసిస్ స్థావరాలపైనా దాడులు చేశామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. ఇడ్లిబ్లోని తీవ్రవాద శిబిరాలను ధ్వంసం చేశామని పేర్కొన్నది. కెర్మాన్ నగరంలో ఈ నెల 3న జరిగిన జంట అత్మాహుతి బాంబు దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఈ దాడులు చేసినట్టు తెలుస్తున్నది.