వాషింగ్టన్, మార్చి 6: ఉక్రెయిన్‌కు సైనిక సహాయాన్ని నిలిపివేసిన అమెరికా.. తాజాగా రష్యాకు సంబంధించిన నిఘా సమాచార మార్పిడిని కూడా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. రష్యాతో శాంతి చర్చలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై ఒత్తిడి తెచ్చేందుకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అమెరికా తీసుకున్న తాజా నిర్ణయంతో రష్యాకు చెందిన వ్యూహాత్మక బాంబర్ విమానాల కదలికలు, విధ్వంసక క్షిపణుల ప్రయాగాలు ఉక్రెయిన్‌కు ఇక తెలిసే అవకాశం ఉండదు.
గత శుక్రవారం అమెరికా అధ్యక్షుడికి, ఉక్రెయిన్ అధ్యక్షుడికి జరిగిన వాగ్యుద్ధం ఫలితంగా అమెరికా ఉక్రెయిన్‌కు సైనిక సహాయాన్ని నిలిపివేయగా తాజాగా నిఘా సమాచార మార్పిడి నిలిపివేతతో ఉక్రెయిన్ భారీగా ప్రాణనష్టాన్ని చవిచూసే ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో ఉక్రెయిన్‌కు బలమైన మద్దతుదారుగా ఉన్న అమెరికా తన వైఖరిని మార్చుకుని రష్యాతో రాజీమార్గంలో యుద్ధ సమస్యను పరిష్కరించడానికి చేస్తున్న ప్రయత్నాలు జెలెన్స్కీకి మింగుడుపడడం లేదు. అయితే సైనిక సాయం, నిఘా సమాచార మార్పిడిపై విధించిన నిషేధాలు తాత్కాలికమేనని, శాంతి చర్చలు పురోగతిని బట్టి వాటిని తొలగించడం జరుగుతుందని సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్ బుధవారం వెల్లడించారు.
ట్రంప్ వెంట పర్యటనల్లో పాల్గొనే నలుగురు సీనియర్ సభ్యులు జెలెన్స్కీ రాజకీయ ప్రత్యర్థులతో రహస్యంగా చర్చలు జరిపినట్టు పొలిటికో పత్రిక బుధవారం వెల్లడించింది. ఉక్రెయిన్ ప్రతిపక్ష నాయకుడు యూలియా టైమోషెంకో, మాజీ అధ్యక్షుడు పెట్రో పోరోషెంకోకు చెందిన పార్టీలోని సీనియర్ సభ్యులతో ఈ చర్చలు జరిగినట్టు పత్రిక తెలిపింది. ఉక్రెయిన్‌లో వెంటనే అధ్యక్ష ఎన్నికలు జరిగే అవకాశంపై చర్చలు జరిగినట్టు ముగ్గురు ఉక్రెయిన్ పార్లమెంట్ సభ్యులను, అమెరికాకు చెందిన ఓ విదేశాంగ విధాన నిపుణుడిని ఉటంకిస్తూ పత్రిక పేర్కొంది.
రష్యాకు చెందిన సైనిక నిఘా సమాచారాన్ని నిలిపివేస్తున్నట్టు అమెరికా ప్రకటించిన దరిమిలా ఉక్రెయిన్‌కు అండగా ఉంటామని ఫ్రాన్స్ ప్రకటించింది. తమ నిఘా వ్యవస్థ అత్యున్నతమైనదని, తమ నిఘా సమాచారాన్ని ఉక్రెయిన్ ఉపయోగించుకోవచ్చని ఫ్రాన్స్ రక్షణ మత్రి సెబాస్టియన్ లెకార్ను వెల్లడించారు. అమెరికా సాయం నిలిచిపోవడంతో ఆ లోటును భర్తీ చేసేందుకు వివిధ రకాల ప్యాకేజీలను సత్వరమే ఉక్రెయిన్‌కు అందచేయవలసిందిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాక్రాన్ తనను ఆదేశించినట్టు ఆయన చెప్పారు.