కాబూల్, ఆగస్టు 15: రెండు దశాబ్దాల తర్వాత ఆఫ్ఘనిస్థాన్‌పై తాలిబన్లు పూర్తిస్థాయిలో మళ్లీ పట్టు సాధించారు. నెల రోజుల్లోనే ప్రభుత్వ బలగాలను ఓడించి యావత్ దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆదివారం ఉదయం రాజధాని కాబూల్ శివారుల్లోకి ప్రవేశించిన తాలిబన్లు సాయంత్రానికల్లా నగరంలో పాగా వేశారు. దీంతో అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అష్రఫ్ ఘనీ.. కుటుంబసభ్యులతో సహా తజికిస్థాన్ వెళ్లిపోయినట్టు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. మరోవైపు, ప్రభుత్వం లొంగిపోవాలని తాలిబన్లు అల్టిమేటం ఇచ్చారు. కాబూల్‌లోని అధ్యక్ష భవనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అధ్యక్ష భవనం నుంచే ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్థాన్‌ను ప్రకటిస్తామన్నారు. కాబూల్‌ను బలవంతంగా ఆక్రమించే ఉద్దేశం తమకు లేదని, ప్రజలు భయభ్రాంతులు కావద్దని పేర్కొన్నారు. మరికొన్ని రోజుల్లో శాంతియుత వాతావరణంలో అధికార మార్పిడి జరుగుతుందని వెల్లడించారు.
చినూక్ హెలికాప్టర్లలో తరలింపు
కాబూల్ తాలిబన్ల వశంకావడంతో అమెరికా తమ దౌత్య సిబ్బందిని తరలించే కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టింది. బోయింగ్ సీహెచ్-47 చినూక్, సికోర్‌స్కై యూహెచ్-60 హెలికాప్టర్లు కాబూల్‌లోని అమెరికా దౌత్య కార్యాలయంపైకి చేరుకొన్నాయి. ఆ తర్వాత కొద్ది సమయానికే ఆ కార్యాలయం మీద నల్లటి దట్టమైన పొగ కనిపించింది. రక్షణపరమైన కీలక పత్రాలు తాలిబన్లకు దొరక్కూడదనే ఉద్దేశంతోనే అమెరికా అధికారులు వాటిని దహనం చేసినట్టు సమాచారం. మరోవైపు, ఖాతాల్లోని సొమ్ము తీసుకొనేందుకు కాబూల్ ప్రజలు పెద్దయెత్తున బ్యాంకుల ఎదుట బారులు తీరారు. కాబూల్‌లోని భారత పౌరులు, దౌత్యవేత్తలను స్వదేశానికి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వవర్గాలు తెలిపాయి.
కాబూల్‌పై గంటసేపు గాల్లోనే చక్కర్లు
ఢిల్లీ నుంచి ఆదివారం 40 మంది ప్రయాణికులను ఆఫ్ఘన్‌కు తీసుకెళ్లిన ఎయిరిండియా విమానం ఒకటి ట్రాఫిక్ నియంత్రణ అనుమతుల ఆలస్యంతో గంటపాటు ఆకాశంలోనే చక్కర్లు కొట్టి ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయింది. ఈ విమానంలో 129 మంది ప్రయాణికులు కాబూల్ నుంచి ఢిల్లీకి వచ్చారు.
ఆ వ్యధ మళ్లీ వద్దు!
చేతి వేళ్లకు నెయిల్ పాలిష్ వేసుకుంటే వేళ్ల నరికివేత, పురుషులతో కలిసి పనిచేస్తే చచ్చేవరకు రాళ్లతో కొట్టడం, బిగుతైన దుస్తులు ధరిస్తే రాడ్లతో నెత్తుటేర్లు పారించడం.. ఇవే 1998-2001 మధ్య కాలంలో ఆఫ్ఘన్‌ను ఆక్రమించిన తాలిబన్ల రాజ్యంలో మహిళలపై జరిగిన అరాచకాలు. తాజాగా మళ్లీ ఆఫ్ఘన్ తాలిబన్ల చెరలోకి వెళ్లడంతో అక్కడి మహిళలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.