ముంబై: అమెరికాకు చెందిన స్టార్ సింగర్, పాటల రచయిత జోయ్ జొనాస్ గత రెండు రోజుల నుంచి వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. జోయ్ జొనాస్, ఆయన భార్య సోఫియే టర్నర్ విడాకుల వార్తలు మీడియాలో ప్రధానంగా కనిపిస్తున్నాయి. తామిద్దరం పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నామని, తమ నాలుగేళ్ల మరుపురాని వైవాహిక జీవితానికి ముగింపు పలుకబోతున్నామని, తమను అభిమానించే వాళ్లంతా ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకోవాలని కోరుతూ జోయ్, సోఫియే జంట రెండు రోజుల క్రితం సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ క్రమంలోనే మాజీ నికెలోడియన్ నటి అలెక్సా నికోలస్ సింగర్ జోయ్ జొనాస్‌పై సంచలన ఆరోపణలు చేసింది. జొనాస్ తనను నగ్న ఫొటోలు పంపమని కోరాడని ఆమె వెల్లడించింది. ‘జోయే 101’ చిత్రీకరణ సందర్భంగా తాను జోయ్ జనాస్తో కలిసి పనిచేశానని, ఆ సమయంలో ఆయన తనను నగ్న ఫొటోలు అడిగాడని అలెక్సా పేర్కొంది. తామిద్దరం టీనేజ్‌లో ఉన్నప్పుడు జోయ్ జొనాస్‌ను తాను కలుసుకున్నానని, అప్పడతను ప్యూరిటీ రింగ్ ధరించి ఉన్నాడని, అయినా కూడా తనను న్యూడ్ ఫొటోస్ అడిగాడని ఆమె ట్వీట్ చేసింది.
వివాహం జరిగే వరకు తమ వర్జినిటీకి గుర్తుగా జొనాస్ సోదరులు జోయ్ జొనాస్, నిక్ జొనాస్, కెవిన్ జొనాస్ సోదరులు ప్యూరిటీ రింగ్‌లు ధరించేవారు. ఇప్పుడు నిక్ బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రాను వివాహం చేసుకుని ఒక బిడ్డకు, కెవిన్.. డేనియల్లే జొనాస్‌ను పెళ్లాడి ఇద్దరు బిడ్డలకు తండ్రులయ్యారు. జోయ్ నాలుగేళ్ల క్రితం సోఫియేను పెళ్లి చేసుకున్నాడు. వీరికి కూడా ఇద్దరు కూతుర్లు. ఇప్పుడు ఇద్దరూ విడాకులకు సిద్ధమయ్యారు. కాగా, నటి అలెక్సా ఆరోపణలపై జోయ్ ఇంకా ఎలాంటి స్పందన తెలియజేయలేదు.