యునైటెడ్ నేషన్స్, జనవరి 17: పాకిస్థాన్‌కు చెందిన కరుడుగట్టిన లష్కరే తాయిబా (ఎల్ఈటీ) ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ మక్కీని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఎల్ఈటీలో నంబర్ 2 స్థానంలో ఉన్న మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు భారత్ సుదీర్ఘకాలంగా దౌత్యపోరాటం చేస్తున్నది. ఎట్టకేలకు ఐరాస భద్రతామండలి ‘1267 ఐఎస్ఐఎల్ (డాయిష్) అండ్ అల్ కాయిదా శాంక్షన్స్ కమిటీ’ మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా తీర్మానించి సోమవారం ప్రకటన విడుదల చేసింది. గత ఏడాది జూన్ 16 కూడా అమెరికా, భారత్ సంయుక్తంగా మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే తీర్మానం ప్రవేశపెట్టగా చైనా వీటో చేసింది. ఈసారి చైనా ఎలాంటి అడ్డుపుల్లలు వేయకపోవటంతో మక్కీపై తీర్మానం నెగ్గింది. ఐరాస నిర్ణయంతో మక్కీపై ప్రపంచవ్యాప్తంగా ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. అతని ఆస్తులు ఎక్కడ ఉన్నా ఆయా దేశాలు స్తంభింపజేయాల్సి ఉంటుంది. మక్కీ విదేశాలకు వెళ్లకుండా ఆంక్షలు విధిస్తారు. ఉగ్ర కార్యకలాపాల కోసం అతడు నిధులు సేకరించకుండా నిషేధిస్తారు. ఎల్ఈటీ అధినేత హఫీజ్ సయీద్‌కు మక్కీ బావమరిది.
ఉగ్ర ప్రమాదం పొంచే ఉన్నది: భారత్
మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించటాన్ని భారత్ స్వాగతించింది. దక్షిణాసియా ప్రాంతంలో ఇప్పటికీ ఉగ్రవాదం పెనుముప్పుగానే ఉన్నదని భారత విదేశాంగశాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ మంగళవారం పేర్కొన్నారు. మక్కీపై చైనా కూడా స్పందించింది. ఉగ్రవాదం అందరికీ ప్రమాదమేనని, అందుకే మక్కీపై తీర్మానాన్ని అడ్డుకోలేదని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ వ్యాఖ్యానించారు.
ఎవరీ మక్కీ?
మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించటం వెనుక భారత ప్రభుత్వ సుదీర్ఘ పోరాటం ఉన్నది. భారత్‌లో ఎల్ఈటీ చేసిన ప్రతి భారీ ఉగ్రదాడి వెనుక మక్కీ పేరే వినపడుతుంది. భారత్‌లో అతని ఆధ్వర్యంలో 7 ఉగ్రదాడులు జరిగినట్టు భారత ప్రభుత్వం గుర్తించింది. వీటిలో 2000 సంవత్సరంలో పార్లమెంటుపై దాడి కూడా ఉండటం గమనార్హం. 2008లో రాంపూర్‌లోని మిలిటరీ క్యాంపుపై దాడి, 2018లో బారాముల్లా, శ్రీనగర్, బందీపోర్ ఉగ్రదాడులతోపాటు కశ్మీర్‌కు చెందిన ప్రముఖ జర్నలిస్టు సుజత్ బుఖారీ హత్య వెనుక కూడా మక్కీయే ఉన్నాడు.
2008 ముంబై ఉగ్రదాడులకు కూడా ఇతడే వ్యూహాలు రచించినట్టు భారత నిఘా వర్గాలు గుర్తించాయి. 2006 మే 7న హైదరాబాద్‌లోని ఓడియన్ సినిమా థియేటర్లో జరిగిన బాంబుదాడులు కూడా మక్కీ పనే. మక్కీని పట్టించినవారికి 2 మిలియన్ డాలర్లు ఇస్తామని అమెరికా గతంలో ప్రకటించింది. మక్కీ పాకిస్థాన్‌లో 2020 వరకు స్వేచ్ఛగా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించాడు. అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిడి రావటంతో 2019లో అతన్ని పాక్ ప్రభుత్వం అరెస్టు చేసింది. 2020లో పాక్ కోర్టు మక్కీని దోషిగా తేల్చింది. మక్కీ ప్రస్తుతం ఎల్ఈటీ రాజకీయ, విదేశీ వ్యవహారాల విభాగం అధిపతిగా ఉన్నాడు.