వాషింగ్టన్: అబాట్ డయాబెటిస్ గ్లూకోజ్ సెన్సర్లు వాడొద్దని అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ) ప్రజలను హెచ్చరించింది. ఈ సెన్సర్ పరికరాల్లో తప్పుడు రీడింగ్‌లు నమోదు కావడం వల్ల నవంబర్ 14 వరకు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని, 736 మంది గాయపడ్డారని తెలిపింది. ‘ఫ్రీైస్టెల్ లిబర్ 3, ఫ్రీైస్టెల్ లిబర్ 3 ప్లస్ సెన్సర్లు తప్పుగా తక్కువ గ్లూకోజ్ రీడింగ్‌లు చూపిస్తున్నాయి. దీని వల్ల రోగుల ఆరోగ్యం తీవ్ర ప్రభావం పడుతోంది. తీవ్రమైన గాయాలు, మరణం లాంటి పరిణామాలు సంభవించొచ్చు’ అని ఎఫ్‌డీఏ పేర్కొంది. సుమారు 30 లక్షల సెన్సర్ పరికరాలు ఇలాంటి తప్పుడు రీడింగ్‌లు చూపిస్తున్నాయని అబాట్ డయాబెటిస్ కేర్ సంస్థ తెలిపింది. ప్రజలు తమ గ్లూకోజ్ మీటర్లలో లోపాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి www.FreeStyleCheck .comలో పరిశీలించుకోవచ్చని తెలిపింది. లోపాలు గల సెన్సర్లను ఉచితంగా రీప్లేస్ చేస్తామని ప్రకటించింది.