Iceberg | న్యూఢిల్లీ, జనవరి 24 : ప్రపంచంలోనే అతిపెద్దదైన ‘ఏ23ఏ’ ఐస్బర్గ్ (మంచుకొండ) బ్రిటిష్ భూభాగం వైపు దూసుకొస్తున్నది. అంటార్కిటికా నుంచి విడిపోయి అట్లాంటిక్ మహా సముద్రంలో కొట్టుకొస్తున్న ఈ భారీ హిమ పర్వతం మున్ముందు దక్షిణ జార్జియా ద్వీపాన్ని ఢీకొనే అవకాశం కనిపిస్తున్నది. ప్రస్తుతం ఆ ప్రాంతానికి 280 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఐస్బర్గ్ బలమైన గాలులు, సముద్ర ప్రవాహాల ప్రభావం వల్ల ముందుకు కదులుతున్నది. దీని గమనంపై శాస్త్రవేత్తలు చాలా కాలం నుంచి దృష్టి సారించారు.
పశ్చిమ అంటార్కిటికాలోని ఫిల్చ్నర్-రోన్ ఐస్ షెల్ఫ్ నుంచి విడిపోయిన ఈ హిమ పర్వతం గత 37 ఏండ్ల నుంచి స్థిరంగా కొనసాగుతున్నది. దాదాపు 4 వేల చదరపు కిలోమీటర్ల వైశాల్యాన్ని కలిగివున్న ఈ హిమఖండం పరిమాణంలో మన ముంబై నగరం కంటే ఆరు రెట్లు పెద్దది. లక్షల కోట్ల టన్నుల బరువు ఉండే ఈ మంచు ఫలకాన్ని ‘మెగాబర్గ్’ అని పిలుస్తున్నారు. గత రెండేండ్ల నుంచి నీటిపై తేలియాడుతున్న ఈ ఐస్బర్గ్ సమీప భవిష్యత్తులో దక్షిణ జార్జియా ద్వీపాన్ని ఢీకొని, అక్కడే చిక్కుకుపోయే అవకాశం కనిపిస్తున్నది. ఇదే జరిగితే ఆ ఐస్బర్గ్పై ఉన్న పెంగ్విన్లు తమ పిల్లలకు ఆహారాన్ని అందించడం కష్టమవుతుంది. కొన్ని పిల్లలు ఆకలితో అలమటించవచ్చు.