శుక్రవారం 27 నవంబర్ 2020
International - Oct 28, 2020 , 18:17:30

న్యూయార్క్‌‌లో పంజాబీలకు అరుదైన గౌరవం..

న్యూయార్క్‌‌లో పంజాబీలకు అరుదైన గౌరవం..

న్యూయార్క్: అమెరికాలో నివసించే మన ఇండియన్ పంజాబీ కమ్యూనిటీకి అరుదైన గౌరవం దక్కింది. న్యూయార్క్‌ నగరంలో నిత్యం రద్దీగా ఉండే రిచ్ మాండ్ ప్రాంతానికి ‘పంజాబ్ ఎవెన్యూ’ అని న్యూయార్క్ సిటి కౌన్సిల్ పేరు పెట్టింది. 101 అవెన్యూ స్ట్రీట్ నెం.111 నుంచి 123 వరకు ఉన్న ప్రాంతాన్ని ఇకపై పంజాబ్ ఎవెన్యూగా పిలవనున్నారు. కౌన్సిల్ మెంబర్ అడ్రీన్ ఆడమ్స్ "పంజాబ్ ఎవెన్యూ"‌ వీధిని అక్టోబర్ 24న ప్రారంభించారు. ఈ  సందర్భంగా పంజాబీలు సోషల్ మీడియాలో పెద్దఎత్తున ఆనందోత్సాహాలను పంచుకుంటున్నారు. ఈ ప్రాంతానికే "పంజాబ్ ఎవెన్యూ’ అని పేరు ఎందుకు పెట్టారంటే..?

ఈ ప్రాంతంలో భారత్‌కు చెందిన పంజాబీలు అధిక సంఖ్యలో ఉండటంతో పంజాబ్ ఎవెన్యూగా ప్రాంతానికి నామకరణం చేయాలని అడ్రీన్ ఆడమ్స్ గతంలో న్యూయార్క్ సిటీ కౌన్సిల్‌లో ప్రతిపాదించారు. ఇదే ప్రాంతంలో రెండు అతిపెద్ద గురుద్వారాలు కూడా ఉండటం విశేషం. అంతేకాకుండా ఈ ప్రాంతంలోని మెజారిటీ వ్యాపారస్థులు కూడా పంజాబీ కమ్యూనిటీకి చెందినవారే. కాగా.. న్యూయార్క్‌లో తమకు దక్కిన గౌరవం పట్ల పంజాబ్ కమ్యూనిటీ ఆనందం వ్యక్తం చేసింది. పంజాబీ కమ్యూనిటీని గుర్తించి ప్రత్యేక గౌరవం ఇచ్చినందుకు సిటి కౌన్సిల్‌కు పంజాబీలు ధన్యవాదాలు తెలిపారు. రెండేండ్ల నుంచి ఈ ప్రాంతానికి పంజాబ్ ఎవెన్యూ అని పేరు పెట్టేందుకు అనేక సౌత్ ఏషియన్ గ్రూపులు, సిటీ కౌన్సిల్ మెంబర్ అడ్రీన్ ఆడమ్స్ కష్టపడ్డారు. ఎట్టకేలకు వారి కష్టానికి ప్రతిఫలం దక్కింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.