Asteroid | భారీ గ్రహశకలం భూమికి దగ్గర నుంచి దూసుకెళ్లింది. సోమవారం మధ్యాహ్నం 3.16 గంటల సమయంలో ఆస్టరాయిడ్ 2025 ఎన్జే భూమికక్షకు చాలా దగ్గరగా వెళ్లిందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తెలిపింది. దాదాపు 85 అడుగుల వెడెల్పుతో ఉన్న ఈ ఆస్టరాయిడ్ గంటకు 48,800 కిలోమీటర్ల వేగంతో భూమి కక్ష్య నుంచి దాదాపు 22.4 లక్షల కిలోమీటర్ల దూరంలో నుంచి వెళ్లిందని పేర్కొంది. ఫుట్‌బాల్ మైదానం పరిమాణంలో ఉన్న ఈ ఖగోళ వస్తువు భూమిని ఢీకొట్టేందుకు అవకాశం లేదు. అయినా దాని పరిమాణం, వేగాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రమాదకరమైన కేటగిరిలో చేర్చింది. ఈ ఆస్టరాయిడ్ అపోలో తరగతికి చెందిన భూమికి సమీపంలో ఉన్న వస్తువుల్లో ఒకటి.
ఇది సూర్యుని చుట్టూ ఆర్థోగ్రాఫిక్ మార్గంలో ప్రయాణిస్తూ కాలానుగుణంగా భూమికి దగ్గ నుంచి వెళ్తుంది. దీని పూర్తి కక్ష్యకాలం దాదాపు మూడు సంవత్సరాల మూడు నెలలు. ఈ ఆస్టరాయిడ్‌ను నాసా పర్యవేక్షిస్తూ వస్తుంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) సైతం పరిశీలిస్తూ వస్తున్నది. 2025 ఎన్జే ఆస్టరాయిడ్ మళ్లీ తిరిగి 2028 సెప్టెంబర్ 15న తిరిగి భూమికి దగ్గరగా వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ఆస్టరాయిడ్ భూమి నుంచి దాదాపు 22లక్షల కిలోమీటర్ల దూరం నుంచి వెళ్తున్నా.. ఇలాంటి వాటిపై నిరంతరం నిఘా వేయాల్సిందేనని నాసా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
నాసాతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు అంతరిక్ష పరిశోధనా సంస్థలు భూమికి దగ్గరగా వచ్చే ఖగోళ వస్తువులను పరిశీలిస్తున్నాయి. వాటి కక్ష్య, వేగం, పరిమాణం కారణంగా భవిష్యత్‌లో వాటితో ఎలాంటి ప్రమాదంపై లోతైన అధ్యయనం చేస్తున్నాయి. ఈ గ్రహశకలాలు కూడా అటెన్ తరగతికి చెందినవి. ఇవి తరచుగా భూమి కక్ష్యను దాటి వెళ్తుంటాయి. అటెన్ అనేది భూమికి దగ్గరగా ఉన్న కక్ష్యలో తిరిగే గ్రహశకలాల సమూహం. శాస్త్రవేత్తలు అలాంటి గ్రహశకలాలపై ప్రత్యేక దృష్టి సారిస్తుంటారు.
ఎందుకంటే వాటి కక్ష్యలో స్వల్ప మార్పు జరిగినా భవిష్యత్తులో సవాల్‌గా మారుతుంది. ఈ క్రమంలో ఆస్ట్రరాయిడ్స్ కదలికలను గమనించడం అవసరమని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా.. ఇలాంటి ఖగోళ వస్తువులను ఇస్రో సైతం నిశితంగా పరిశీలిస్తుంది. ఇస్రో, నాసా, ఈసా, జాక్సా సంస్థలు ఆస్ట్రరాయిడ్ ట్రాకింగ్‌ను మెరుగుపరిచేందుకు కలిసి పని చేస్తున్నాయి. ఇస్రో ఒక ఆస్టరాయిడ్‌పై దిగి దాని నిర్మాణాన్ని అధ్యయనం చేసే మిషన్ కూడా భవిష్యత్‌లో చేపట్టబోతున్నది.