నోయిడా: ‘నిగనిగలాడే నల్లటి కురులతో ఒత్తయిన జుట్టున్న వాడు కావాలని కలలు కంటే, నెత్తిన వెంట్రుకలే లేకుండా తళతళలాడే గుండుతో కన్పిస్తున్న ఈ బట్టతల భర్త నాకొద్దు’ అని బావురుమంటూ నోయిడాలోని ఒక ఇల్లాలు పోలీసులను ఆశ్రయించింది. తనను మోసం చేశారంటూ నోయిడాలోని గౌర్ సిటీ అవెన్యూ 1 నివాసి లవికా గుప్తా తన భర్త సన్యం జైన్, అత్తింటికి చెందిన నలుగురిపై సెంట్రల్ నోయిడాలో బిస్రాక్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ వివాహం 2024లో అయ్యిందని, మందపాటి జుట్టున్న భర్తను ఇస్తానని అత్తింటివారు హామీనిచ్చారని, కానీ తన భర్త జైన్ పూర్తి బట్టతలతో ఉన్నాడని, హెయిర్ ప్యాచ్‌తో తన లోపాన్ని కప్పిపుచ్చుకుంటున్నాడని ఆమె ఆరోపించింది. అంతేకాకుండా తన భర్త రూపం, చదువు, ఆదాయం ఇలా అన్ని విషయాల్లో తనను మోసం చేశారని, అంతేకాకుండా తనతో అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లింగ్ చేయించడానికి తన భర్త ప్రయత్నించాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.