పాట్నా: దొంగను అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులు ఏకంగా ఆ దొంగ ఇంట్లోనే కోట్లాది రూపాయల విలువచేసే ఆభరణాలు చోరీ చేసిన ఘటన బీహార్లో వైశాలిలో చోటుచేసుకుంది. రామ్ప్రీత్ సాహ్నీ, ఆయన భార్య ఒక దొంగల ముఠాను నడుపుతున్నారన్న ఆరోపణపై లాల్గంజ్ పోలీసులు వారి ఇంటిపై దాడి చేసి పెద్దయెత్తున బంగారం, వెండి, నగలు స్వాధీనం చేసుకుని సాహ్నీ భార్యను అరెస్ట్ చేశారు. అయితే వాటిని వారు కొట్టేసి, కేవలం పాత పాత్రలు, ఒక టీవీ, కొన్ని తుక్కు సామాన్లు మాత్రమే స్వాధీనం చేసుకున్నట్టు రికార్డుల్లో చూపారు. వారు ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న రెండు కిలోల బంగారం, ఆరు కిలోల వెండి, ఇతర విలువైన వస్తువుల గురించి రికార్డుల్లో ప్రస్తావించలేదు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ఆ స్టేషన్ ఇన్చార్జిని, మరో ఇద్దరు అధికారులను సస్పెండ్ చేస్తూ పై అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.