Charles sobhraj | బికినీ కిల్లర్‌గా పేరుగాంచిన చార్లెస్ శోభారాజ్‌ను విడుదల చేయాలంటూ నేపాల్ సుప్రీంకోర్టు బుదవారం తీర్పు వెలువరించింది. 20 ఏండ్ల పాటు జీవితఖైదు అనుభవించిన శోభారాజ్‌ను సత్ప్రవర్తన కలిగిన ఖైదీల జాబితాలో చేర్చి విడుదల చేయాలని నేపాల్ ప్రభుత్వాన్ని ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా, శోభారాజ్ విడుదల అవుతుండటంతో ఆయనను అరెస్ట్ చేసి సెంట్రల్ జైల్ ఊచల వెనక్కి నెట్టిన పోలీస్ అధికారి సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ఆ పోలీసు చెప్పిన కథ అచ్చం సినిమా స్టోరీ మాదిరిగానే ఉన్నది.
నేపాల్‌లో 1976 లో ఓ జంట దారుణంగా హతమయ్యారు. మృతుల్లో యువతి అమెరికా వాసి కాగా, యువకుడు కెనడా వాసి. ఇద్దరు వేర్వేరు ప్రాంతాల్లో దారుణహత్యకు గురయ్యారు. వీరిని హత్య చేసి దగ్గర్లో ఉన్న కాలువలో పడేయడంతో ప్రజలు పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తున్నారు. అప్పుడు కేసీ గణేష్ అనే కుర్రాడి వయసు 12. అందరిలాగే చూసి పాపం అనుకుంటూ వెళ్లాడు. ఇది జరిగిన 20 ఏండ్ల తర్వాత ఈ కుర్రాడే డీఎస్సీగా ఉద్యోగం సంపాదించాడు.
కాఠ్మండులో ఓ డాక్యుమెంటరీ షూటింగ్ కోసం శోభారాజ్ వచ్చిన ఫొటోను హిమాలయన్ టైమ్స్ పత్రిక ప్రచురించింది. ఈ ఫొటో పోలీసుల దృష్టికి వచ్చి ఆయనను అరెస్ట్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే, హత్యలో నిందితుడిగా చూపేందుకు కావాల్సిన సాక్ష్యాలు లేకపోవడంతో.. ఇమ్మిగ్రేషన్ చట్టాన్ని ఉల్లంఘించాడనే ఆరోపణలపై 2003 లో ఆయనను కాఠ్మండులోని క్యాసినోలో అరెస్ట్ చేశారు. అనంతరం జంట హత్యలకు సంబంధించి సేకరించిన సాక్ష్యాల ఆధారంగా పోలీసులు శోభారాజ్‌పై హత్య కేసు నమోదు చేశారు. ఎన్నో దేశాల పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన శోభారాజ్‌ను అరెస్ట్ చేసినందుకు ఎంతో గర్వంగా ఫీలయ్యామని డీఎస్సీ కేసీ గణేష్ చెప్పాడు. ఆయనపై కాఠ్మండు కోర్టులో ఒకటి, భక్త్పూర్ కోర్టులో మరో కేసు విచారించి రెండు హత్యలను శోభారాజ్ చేసినట్లు తేల్చి జీవితఖైదు విధించారు.
నేపాల్‌కు వచ్చిన ఇద్దరు జంట పర్యాటకుల సంచుల్లో బంగారు నగలు ఉంటాయని భావించి శోభారాజ్ హత్య చేసినట్లు రిటైర్డ్ డీఎస్పీ కేసీ గణేష్ చెప్పాడు. శోభారాజ్‌ను అరెస్ట్ చేసిన తర్వాత హతుల కుటుంబాల నుంచి తనకు ప్రశంసలు అందాయని తెలిపాడు. అయితే, ఇన్నేండ్లకు ఆయనను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడం చాలా సంతోషమన్నారు. ఓ సీనియర్ సిటిజన్ అయిన శోభారాజ్‌ను ముందస్తుగా విడుదల చేస్తున్నందుకు సంతోషంగా ఉన్నదన్నారు. సీనియర్ సిటిజన్స్ పట్ల నేపాల్ దేశం ఎంత సున్నితంగా ఉంటుందో, మానవ హక్కుల పట్ల నేపాలీయుల నమ్మకాన్ని శోభారాజ్ విడుదల స్పష్టం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
గమ్మత్తైన విషయం ఏంటంటే.. నేపాల్‌లో 2003 లో నేరారోపణకు ముందు శోభారాజ్‌పై ఏ దేశంలోనూ హత్యానేరం నమోదు కాలేదు. ఆయన 1970 లో 15 నుంచి 20 మందిని దారుణంగా హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పలువురు పాశ్చాత్య పర్యాటకులతో స్నేహం చేసి వారికి డ్రగ్స్ ఇచ్చి చంపినట్లు తెలుస్తున్నది. ఈయన చంపినవారిలో పలువురు బికినీలు ధరించి ఉండటంతో ‘బికినీ కిల్లర్’ అని పేరు వచ్చింది.