వాషింగ్టన్ : అమెరికాలోని టెన్నెసీలో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కెంటకీలో 7 అంగుళాల వర్షపాతం నమోదైంది. కెంటకీ గవర్నర్ ఆండీ బెషీర్ మాట్లాడుతూ, శని, ఆదివారాల్లో వరదల్లో చిక్కుకున్నవారిని బయటకు తీసుకొచ్చిన సంఘటనలు 1,000కిపైగా నమోదయ్యాయన్నారు. నాలుగు రాష్ర్టాల్లో అనేక చోట్ల తీవ్ర స్థాయిలో వరదలు సంభవించాయి.
దీంతో టెన్నెసీలో కాలువల కట్టలు తెగిపోయాయి. కెంటకీలో 9 మంది మరణించారు. వీరిలో ఓ మైనర్ కూడా ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని బెషీర్ తెలిపారు. పశ్చిమ, ఉత్తర టెన్నెసీ, దక్షిణ కెంటకీ, వెస్ట్ వర్జీనియా-వర్జీనియా సరిహద్దుల్లో అనేక ప్రాంతాల్లో రోడ్లు తీవ్రంగా దెబ్బతినడంతో, వాటిని మూసివేశారు. వరదల వల్ల రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపై ప్రభావం పడటం అనేక సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి అని రవాణా శాఖ అధికారులు చెప్పారు.