Gaza | హమాస్ అంతమే లక్ష్యంగా గాజా (Gaza)పై ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడుతున్నాయి. ఐడీఎఫ్ జరుపుతున్న ఈ దాడుల్లో అనేక మంది పాలస్తీనియన్లు (Palestinians) ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా గాజాపై ఇజ్రాయెల్ (Israel) దళాలు గత రాత్రి వరుస వైమానికి దాడులకు పాల్పడ్డారు. పలు చోట్ల కాల్పులు జరిపారు. ఈ దాడుల్లో దాదాపు 82 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అందులో 38 మంది మానవతా సాయం కోసం ఎదురుచూస్తున్న వారే. ఇక అనేక మంది గాయపడినట్లు పేర్కొంది. గాయపడ్డ వారు ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించింది.
గాజాలో 58 వేలు దాటిన మృతుల సంఖ్య
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం అక్టోబర్ 2023లో ప్రారంభమైన విషయం తెలిసిందే. హమాస్ ఇజ్రాయెల్‌లోని అనేక ప్రాంతాలపై దాడి చేసింది. ఈ దాడుల్లో 1200 మందికిపైగా ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రతీకారంలో ఇప్పటివరకు 58 వేలకుపైగా పాలస్తీనియన్లు మరణించారు. గాజాలో పెద్ద సంఖ్యలో జనాభా నిరాశ్రయులయ్యారు. వేలాది మంది ఆకలి బాధలను ఎదుర్కొంటున్నారు.
గాజాలో 60 రోజుల కాల్పుల విరమణ : ట్రంప్
గాజా అంశంలో తమ ప్రతినిధులు ఇజ్రాయెల్‌తో సుదీర్ఘ చర్చలు చేపట్టారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తెలిపిన విషయం తెలిసిందే. గాజాలో 60 రోజుల కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించిందని, ఆ సమయంలో అన్ని పార్టీలతో కలిసి యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తామన్నారు. శాంతి ఒప్పందం కోసం ఖతార్, ఈజిప్ట్ తీవ్రంగా ప్రయత్నించాయని, వాళ్లే దీనికి సంబంధించిన తుది ప్రతిపాదన చేస్తారన్నారు. మిడిల్ఈస్ట్ మంచి కోసం హమాస్ ఆ ఒప్పందాన్ని అంగీకరిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. అయితే, గాజాపై యుద్ధాన్ని పూర్తిగా ఆపేస్తామంటేనే ఒప్పందాన్ని అంగీకరిస్తామని హమాస్ సంస్థ తెలిపింది.
హమాస్‌ను పూర్తిగా తుడిచిపెట్టేస్తాం : ఇజ్రాయెల్ ప్రధాని
గాజా (Gaza)లో 60 రోజుల పాటు కాల్పుల విరమణ పాటించేందుకు ఇజ్రాయెల్ అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించిన విషయం తెలిసిందే. ట్రంప్ ప్రకటన వేళ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ (Benjamin Netanyahu) కీలక వ్యాఖ్యలు చేశారు. హమాస్ (Hamas)ను పూర్తిగా తుడిచిపెట్టేస్తామని వ్యాఖ్యానించారు. ‘హమాస్ ఉండదు.. హమస్థాన్ ఉండదు. ఆ సంస్థను పూర్తిగా తుడిచిపెట్టేస్తాం’ అని వ్యాఖ్యానించారు.
Also Read..
Mass shooting | చికాగోలో కాల్పుల కలకలం.. నలుగురు మృతి
Benjamin Netanyahu | హమాస్‌ను పూర్తిగా తుడిచిపెట్టేస్తాం : ఇజ్రాయెల్ ప్రధాని
Dalai Lama | వారసుడిని నిర్ణయించే హక్కు పూర్తిగా దలైలామాకే ఉంది : భారత్