Road Roller | న్యూఢిల్లీ : రోడ్డు నిర్మాణ పనుల్లో ఉన్న రోడ్డు రోలర్ నుంచి వస్తున్న శబ్దాలు, ప్రకంపనలను భూంకంపగా పొరబడిన స్కూలు విద్యార్థులు ప్రాణాల మీదికి తెచ్చుకున్నారు. స్కూలు భవనం కూలిపోతుందన్న భయంతో మొదటి అంతస్తు నుంచి దూకేసి తీవ్రంగా గాయపడి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్సులోని జహానియన్, ఖనేవాల్ జిల్లాలో జరిగిందీ ఘటన. క్లాస్ రూంలో ఉన్న కొందరు విద్యార్థులు శబ్దాలతోపాటు ప్రకంపనలు గుర్తించారు.
అది భూకంపమేనని భ్రమపడి తోటి విద్యార్థులను అప్రమత్తం చేశారు. భయపడిన విద్యార్థులు కొందరు మెట్ల మార్గం గుండా కిందికి వెళ్లిపోగా, 8 మంది విద్యార్థులు మొదటి అంతస్తు కిటికీల నుంచి కిందికి దూకేశారు. తీవ్రంగా గాయపడిన వారిని సమీపంలోని దవాఖానకి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. స్కూలు సమీపంలో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనుల్లో ఉపయోగించిన రోడ్డు రోలర్ కారణంగా వచ్చిన ప్రకంపనలు, శబ్దాలను విద్యార్థులు తప్పుగా అర్థం చేసుకున్నారని, ప్రమాదానికి అదే కారణమని అధికారులు తెలిపారు.