Guinea Deaths | ఆఫ్రికాలోని గినియా దేశంలో వింత వ్యాధి గత కొన్ని రోజులుగా పలు ప్రాంతాలకు విస్తరిస్తున్నది. ఈ వ్యాధికి గురైన వారిలో 8 మంది చనిపోయినట్లు తెలుస్తున్నది. ఇన్ఫెక్షన్ భయంతో దాదాపు 200 మందిని క్యారంటైన్లో ఉంచారు. ఈ వింత వ్యాధిని తొలుత నాలుగు రోజుల క్రితం గుర్తించినట్లు గినియా ఆరోగ్య మంత్రి ఒండో అయాకబా చెప్పారు. ఈ గుర్తుతెలియని వ్యాధిని గుర్తించే పనిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిమగ్నమై ఉన్నది.
ఈ వింత వ్యాధితో చనిపోయిన వారు కొన్ని రోజుల క్రితం ఇదే ప్రాంతంలో జరిగిన అంత్యక్రియలకు హాజరైనట్లు ప్రభుత్వం చెప్తున్నది. ఈ వ్యాధికి గల కారణాలను తెలుసుకునేందుకు రోగుల నుంచి నమూనాలు సేకరించి పొరుగు దేశం గాబన్‌కు పంపుతున్నారు. మరికొన్ని నమూనాలను సెనెగల్ రాజధాని డాకర్కు కూడా పంపతున్నారు. ఈ వ్యాధికి గురైన వారిలో రక్తస్రావంతోపాటు జ్వరం కనిపిస్తున్నట్లు స్థానికులు చెప్తున్నారు. ఇలా కనిపించిన తర్వాత తొలుత ముక్కు నుంచి రక్తం కారడం మొదలవుతుంది. ఆ తర్వాత జ్వరం, కీళ్ల నొప్పులు, ఇతర శరీర భాగాల్లో నొప్పి కనిపిస్తుంది. ఇలా నొప్పులను భరిస్తూ రోగి కొన్ని గంటల తర్వాత మరణిస్తున్నాడు. ఈ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతున్నదో తెలియక భయపడుతున్న గినియా ప్రభుత్వం దీనికి గురైనట్లుగా అనుమానిస్తున్న దాదాపు 200 మందిని క్వారంటైన్లో ఉంచింది. వీరిలో చాలా మందిలో ప్రస్తుతం ఎలాంటి లక్షణాలు కనపించడం లేదు.
దీని కారణంగా దేశంలోని రెండు గ్రామాల మధ్య రాకపోకలను నిషేధించినట్లు ఆరోగ్య మంత్రి ఒండో అయాకబా తెలిపారు. ప్రస్తుతం కాంటాక్ట్ ట్రేసింగ్ జరుగుతున్నట్లు చెప్పారు. ఇదే సమయంలో ఈక్వటోరియల్ గినియాతో సరిహద్దును తాత్కాలికంగా మూసివేసినట్లు పొరుగు దేశం కామెరూన్‌కు చెందిన ఆరోగ్య మంత్రి మలాచి మనౌడా తెలిపారు. ఈ వ్యాధిని ముందస్తుగా గుర్తించడంలో, ఇన్ఫెక్షన్ను నివారించడంలో తమ దేశం సాయపడుతుందని మనౌడా హామీ ఇచ్చారు. కాగా, ఈక్వటోరియల్ గినియాలో వ్యాప్తి చెందుతున్న గుర్తుతెలియని ఇన్ఫెక్షన్పై డబ్ల్యూహెచ్ఓ తన పరిశోధన ప్రారంభించింది. నమూనాలను పరీక్షిస్తున్నట్లు డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి ఒకరు తెలిపారు. మరికొద్ది రోజుల్లోనే ఈ వ్యాధికి కారణాలను వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.