
హ్యూస్టన్: అమెరికాలోని టెక్సాస్‌లో విషాదం చోటుచేసుకున్నది. శుక్రవారం రాత్రి నిర్వహించిన ఓ మ్యూజిక్ ఫెస్టివల్లో తొక్కిసలాట జరిగి 8 మంది దుర్మరణం చెందారు. 300 మందికి పైగా గాయపడ్డారు. వారాంతాన్ని పురస్కరించుకొని టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో జరిగిన ఆస్ట్రోవరల్డ్ మ్యూజిక్ ఫెస్టివల్‌కు దాదాపు 50వేల మంది హాజరయ్యారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో ప్రేక్షకుల్లో చాలామంది వేదికవైపు దూసుకురావటంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో ఒకరినొకరు తోసుకోవటంతో కిందపడి 8 మంది మృతిచెందారని, మరికొందరు అపస్మారక స్థితిలోకి వెళ్లారని హ్యూస్టన్ ఫైర్ చీఫ్ సామ్ పెనా తెలిపారు. 17 మందిని స్థానిక దవాఖానలకు తరలించామని, వారిలో 11 మంది గుండెపోటుకు గురైనవారు ఉన్నారని వెల్లడించారు. మరణాల సంఖ్య పెరిగే అవకాశం లేకపోలేదని వివరించారు.