Los Angeles | ఇమ్మిగ్రేషన్ దాడులకు వ్యతిరేకంగా నిరసనకారులు చేపట్టిన ఆందోళనలతో అమెరికాలోని లాస్ ఏంజెలెస్ (Los Angeles) రగిలిపోతోంది. శుక్రవారం లాస్ ఏంజెలెస్‌లో ఫెడరల్ అధికారులు జరిపిన దాడులతో నగరమంతా అట్టుడికిన సంగతి తెలిసిందే. వరుసగా నాలుగోరోజైన సోమవారం కూడా లాస్ ఏంజెలెస్‌లో ఆందోళనలు కొనసాగాయి. వలసల పట్ల అధ్యక్షుడు ట్రంప్ చేపడుతున్న విధానాలకు వ్యతిరేకంగా వేలాదిగా జనం వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున నిరసనల్లో పాల్గొన్నారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు నేషనల్ గార్డ్స్‌కు సాయంగా పెంటగాన్ దాదాపు 700 మంది మెరైన్స్ను (US Marines) మోహరించింది.
నిరసనకారులను అడ్డుకునేందుకు నేషనల్ గార్డ్స్ దళాలకు (US National Guard) చెందిన 2 వేల మందిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రంగంలోకి దింపిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం ఉద్రిక్తతలు మరింత తీవ్రతరం అయిన నేపథ్యంలో మరో 2 వేల మంది నేషనల్ గార్డ్స్ దళాలను అదనంగా మోహరించాలని ట్రంప్ ఆదేశించారు. ఈ అదనపు దళాలను అక్కడకు తరలించడానికి ఒకటి లేదా రెండు రోజులు పట్టవచ్చని ఓ అధికారి తెలిపారు. దీంతో వారం మధ్య నాటికి నేషనల్ గార్డ్ సభ్యుల సంఖ్య 4,000 కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా.
ట్రంప్ చర్యను తీవ్రంగా ఖండించిన కాలిఫోర్నియా గవర్నర్
అయితే డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాన్ని కాలిఫోర్నియా (California) గవర్నర్ గవిన్ న్యూసన్ తీవ్రంగా ఖండించారు. నిరసనకారులను అదుపు చేసేందుకు అదనంగా 2000 మంది నేషనల్ గార్డ్స్‌ను మోహరించడం ‘మా దళాలను అగౌరపరచడమే అవుతుంది’ అని ఎక్స్ వేదికగా అసహనం వ్యక్తం చేశారు. నేషనల్ గార్డ్స్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇలా నేషనల్ గార్డ్స్‌ను మోహరించడం తమ రాష్ట్ర సార్వభౌమత్వాన్ని కాలరాయడమే అవుతుందని అక్షేపించారు. దీనిపై న్యాయపరంగా ముందుకెళ్తామని తెలిపారు. కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తానని ప్రకటించారు.
రాష్ట్ర గవర్నర్‌ను సంప్రదించకుండా నేషనల్ గార్డును ఆ రాష్ట్రంలో మోహరించడం చట్ట విరుద్ధం, అనైతికమని డెమోక్రాట్ పార్టీకి చెందిన గవిన్ విమర్శించారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయకుండా అక్కడ నేషనల్ గార్డ్స్‌ను నేరుగా మోహరించడం గత కొన్ని దశాబ్దాల్లో ఇదే ప్రథమం కావడం గమనార్హం. ట్రంప్ తీసుకున్న ఇలాంటి దుందుడుకు చర్యలవల్లే ఆందోళనలు మరింత పెరుగుతున్నాయని న్యూసమ్తోపాటు, లాస్ ఏంజెలెస్ మేయర్ కరెన్ బాస్ విమర్శించారు.
Also Read..
Los Angeles | లాస్ ఏంజెలెస్‌లో కొనసాగుతున్న ఆందోళనలు.. కార్లకు నిప్పు.. VIDEOS
Russia | రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి.. మాస్కోలో విమాన సర్వీసులు బంద్