లాస్ ఏంజెలెస్, జూన్ 9: ఇమ్మిగ్రేషన్ దాడులకు వ్యతిరేకంగా లాస్ ఏంజెలెస్‌లో ఆందోళనచేస్తున్న నిరసనకారులను అణచివేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో ఎన్నడూ లేని విధంగా నేషనల్ గార్డును మోహరిస్తూ తీసుకున్న నిర్ణయంతో ఆదివారం నగరంలో నిరసనలు ఉగ్రరూపం దాల్చాయి. మాస్కులు ధరించిన ఆందోళనకారులను అరెస్టు చేయాలని ట్రంప్ ఆదేశించారు. నిరసనలలో మాస్కులు ధరించడాన్ని నిషేధిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. శాంతి భద్రతలను పరిరక్షించే బాధ్యత రాష్ట్ర గవర్నర్ల పరిధిలో ఉండగా దాన్ని అతిక్రమిస్తూ లాస్ ఏంజెలెస్‌లోకి నేషనల్ గార్డు బలగాలను ట్రంప్ మోహరించడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
వేలాది మంది నిరసనకారులు వీధుల్లోకి వచ్చి ట్రంప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. ఆందోళనకారులు ప్రధాన మార్గాన్ని మూసివేసి కార్లకు నిప్పుపెట్టగా వారిని చెదరగొట్టేందుకు నేషనల్ గార్డు బలగాలు బాష్పవాయు గోళాలను, రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించాయి. డజన్ల కొద్దీ అక్రమ వలసదారులు, నేరపూరిత ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇమ్మిగ్రేషన్ దాడులకు నిరసనగా లాటిన్ అమెరికన్ పౌరులు అధికంగా నివసించే లాస్ ఏంజెలెస్‌లో శుక్రవారం నిరసనలు ప్రజ్వరిల్లాయి. అమెరికాలోనే రెండవ అతి పెద్ద నగరమైన లాస్ ఏంజెలెస్‌లో నిరసనలను అదుపు చేయడానికి ట్రంప్ నేషనల్ గార్డు బలగాలను పంపించడంతో పరిస్థితి అదుపుతప్పింది. అక్రమ వలసదారుల భరతం పడతానని ఎన్నికల ముందు వాగ్దానం చేసి రెండవసారి అధికారంలోకి వచ్చిన ట్రంప్ నేషనల్ గార్డును పంపించి ఉద్దేశపూర్వకంగానే ఉద్రిక్తతలను రెచ్చగొట్టారని విమర్శకులు ఆరోపిస్తున్నారు.
రాష్ట్ర సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించారు..
లోడెడ్ మిషన్ గన్లు, భారీ తుపాకులు ధరించిన నేషనల్ గార్డు బలగాలు అమెరికన్ల చుట్టూ నిలబడి నిరసన తెలియచేసే తమ ప్రాథమిక హక్కును అడ్డుకునేందుకు వేధింపులకు పాల్పడుతున్నారని థామన్ డెన్నింగ్ అనే నిరసనకారుడు ఆరోపించారు. నేషనల్ గార్డును లాస్ ఏంజెలెస్‌లో మోహరించి ట్రంప్ రాష్ట్ర సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించారని కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసామ్ విమర్శించారు. బలగాలను ఉపసంహరించాలని డిమాండు చేశారు.
పోలీసులపై రాళ్లు
సాయంత్రం చీకటి పడుతున్న సమయానికి నిరసనకారులు అక్కడి నుంచి తరలివెళ్లిపోగా మిగిలిన వారిని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. బారికేడ్లను తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న నిరసనకారులు దాని వెనుక దాగుని కాలిఫోర్నియా హైవే పెట్రోల్ పోలీసులపై కాంక్రీటు పెళ్లలు, రాళ్లు, టపాసులు విసిరారు. వాటి నుంచి రక్షించుకునేందుకు పోలీసులు పరుగులు తీయాల్సి వచ్చింది. ట్రంప్ ఆదేశాలతో దాదాపు 300 మంది నేషనల్ గార్డు బలగాలు రంగంలోకి దిగడం నిరసనకారులనే కాక స్థానికులను సైతం ఆగ్రహానికి గురిచేసింది. శనివారం డజన్ల సంఖ్యలో నిరసనకారులను పోలీసులు అరెస్టు చేయగా ఆదివారం కూడా అరెస్టులు కొనసాగాయి. నేషనల్ గార్డు బలగాలను చూసి ఆగ్రహోదగ్రులైన నిరసనకారులు 4 కార్లకు నిప్పంటించారు.
ట్రంప్‌పై దావా వేస్తా
లాస్ ఏంజెలెస్‌లో వలసదారుల నిరసనను అణచివేసేందుకు చట్ట వ్యతిరేకంగా నేషనల్ గార్డు బలగాలను పంపిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తానని కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసామ్ ప్రకటించారు. రాష్ట్ర గవర్నర్‌ను సంప్రదించకుండా నేషనల్ గార్డును ఆ రాష్ట్రంలో మోహరించడం చట్ట విరుద్ధం, అనైతికమని డెమోక్రాట్ పార్టీకి చెందిన గవిన్ విమర్శించారు. కాగా, లాస్ ఏంజెలెస్ వీధులు సోమవారం దాదాపు ప్రశాంతంగా ఉన్నాయి.