Israel Hezbollah War | జెరూసలేం, సెప్టెంబర్ 27: ఇజ్రాయెల్ – లెబనాన్ మధ్య యుద్ధ పరిస్థితులు తీవ్రమవుతున్నాయి. లెబనాన్‌పై భూతల దాడులకు ఇజ్రాయెల్ సిద్ధమవుతున్నది. ఈ మేరకు సరిహద్దుకు భారీగా యుద్ధట్యాంకులను తరలిస్తున్నది. హెజ్బొల్లా లక్ష్యంగా లెబనాన్‌లోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సైనిక బలగాలకు ఇజ్రాయెల్ ఇప్పటికే ఆదేశించింది. ‘మనం హెజ్బొల్లాపై వాయు, సముద్ర మార్గాల్లో దాడులు చేస్తున్నాం, ఇక భూతల దాడులకు సైతం సిద్ధంగా ఉండండి’ అంటూ సైనికులను ఉద్దేశించి ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి యోవ్ గల్లాంట్ పిలుపునిచ్చారు. సరిహద్దు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇజ్రాయెల్ కోరుతున్నది.
శుక్రవారం లెబనాన్‌లో ఇజ్రాయెల్ బాంబు లు, క్షిపణులతో విరుచుకు పడింది. ఈ దాడుల్లో 25 మంది మరణించారు. బీరుట్ లోని హెజ్బొల్లా హెడ్‌క్వార్టర్స్ లక్ష్యంగా దాడులు జరిపినట్టు ఇజ్రాయెల్ మిలటరీ ప్రకటించింది. హెజ్బొల్లా నేత హస్సన్ నస్రుల్లాను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిపినట్టు ఇజ్రాయె ల్లోని ప్రధాన టీవీ చానల్స్ ప్రకటించాయి. ఈ వారంలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 700 మంది మరణించారని, గత మూడు రోజుల్లో 30 వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారని లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. మరోవైపు హెజ్బొల్లా సైతం ఇజ్రాయెల్‌పై రాకెట్లతో దాడి చేస్తున్నది. లెబనాన్‌పై 21 రోజుల పాటు దాడులు విరమించుకోవాలని అమెరికా చేసిన ప్రతిపాదనను ఇజ్రాయెల్ తిరస్కరించింది. హెజ్బొల్లాపై విజయం సాధించేవరకు పోరాడతామని స్పష్టం చేసింది.
ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే యెమెన్ కేంద్రంగా పని చేసే హౌతీలు ఇజ్రాయెల్‌పై దాడికి దిగారు. ఇజ్రాయెల్ దాడిలో గురువారం మరణించిన హెజ్బొల్లా నాయకుడు మహమ్మద్ స్రుర్ మృతికి ప్రతీకారంగా ఈ దాడి చేశామని హౌతీలు ప్రకటించారు. లెబనాన్, హెజ్బొల్లాకు మద్దతు ఇచ్చేందుకు వెనుకాడబోమని హౌతీల నాయకులు అబ్దుల్ మాలిక్ అల్-హౌతీ హెచ్చరించారు. కాగా, సిరియాలోని డమాస్కస్పైనా ఇజ్రాయెల్ దాడి చేసింది.
లెబనాన్ సరిహద్దులో మా లక్ష్యాలు సాధించే వరకు హెజ్బొల్లాను నిర్వీర్యం చేసేందుకు పోరాటం చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ప్రకటించారు. శుక్రవారం ఆయన ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించారు. ‘తనకు ఉన్న ముప్పును తొలగించుకునేందుకు, తన పౌరులను వారి ఇండ్లకు సురక్షితంగా చేర్చేందుకు ఇజ్రాయెల్‌కు అన్ని హక్కులు ఉన్నాయి. అదే పని ఇప్పుడు చేస్తున్నది. ఎల్పాసో, శాన్‌డియాగోను ఉగ్రవాదులు ఘోస్ట్ టౌన్లుగా మారిస్తే అమెరికా సహిస్తుందా? కానీ, ఇజ్రాయెల్ ఏడాదిగా సహిస్తున్నది. హమాస్ లొంగిపోతేనే యుద్ధం ముగుస్తుంది. లేకపోతే విజయం సాధించే వరకు మా పోరాటం కొనసాగుతుంది’ అని నెతన్యాహూ పేర్కొన్నారు. మరోవైపు ఇరాన్లో తాము చేరుకోలేని ప్రాంతం అంటూ ఏదీ లేదని హెచ్చరించారు.