న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ బ్రూక్లిన్ సబ్వేలో కాల్పుల ఘటనలో అనుమానితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఫ్రాంక్ జేమ్స్ (Frank James) అనే 62 ఏండ్ల వ్యక్తికి ఈ ఘటనతో సంబంధం ఉండొచ్చని భావిస్తూ.. అతని ఫొటోను విడుదల చేసిన పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో నిందితుడైన జేమ్స్‌ను మ్యాన్‌హట్టన్‌లో అదుపులోకి తీసుకున్నామని న్యూయార్క్ పోలీస్ చీఫ్ కీచాంట్ సెవెల్ చెప్పారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి 50వేల డాలర్ల నజరాన ప్రకటించిన విషయం తెలిసిందే.
న్యూయార్క్‌లోని బ్రూక్లిన్ సబ్వే రైల్వే స్టేషన్లో దుండగుడు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం రద్దీగా ఉండే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనలో 23 మంది గాయపడ్డారు. కాల్పులు జరుపడానికి ముందు నిందితుడు గ్యాస్ మాస్క్ ధరించి సబ్‌వేకార్‌లో పొగబాంబులు విసిరిడు. అనంతరం కాల్పులు ప్రారంభించినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఈ ఘటనలో 10 మందికి బుల్లెట్ గాయాలవగా, మరో 13 మంది తొక్కిసలాటలో గాయపడ్డారు.