కొంత మంది వయసు తమకు ఒక సంఖ్య మాత్రమేనని, జీవితాన్ని అది నిర్ణయించదని నిరూపిస్తూ ప్రపంచం మొత్తానికి స్ఫూర్తినిస్తుంటారు. తాజాగా ఒక 60 ఏళ్ల వృద్ధుడు కూడా ఇలాంటి సాహసమే చేశాడు. పది అంతస్తుల బిల్డింగ్ పైన నిలబడి చూస్తేనే గుండెలు గుభేలుమంటాయి చాలా మందికి.. అలాంటిది ఈ వృద్ధుడు వట్టి చేతులతో ఏకంగా 48 అంతస్తుల బిల్డింగ్ ఎక్కేశాడు.
‘ఫ్రెంచ్ స్పైడర్‌మ్యాన్’గా అందరూ పిలిచే అలైన్ రాబర్ట్ ఒక క్లైంబర్. ఎత్తయిన భవనాలను ఎలాంటి సేఫ్టీ పరికరాలు లేకుండా ఎక్కేయడం అతని స్పెషాల్టీ. మరి అలాంటి వ్యక్తి తన 60వ బర్త్ డేను మామూలుగా సెలబ్రేట్ చేసుకుంటాడా? పారిస్‌లోని ఒక 48 అంతస్తుల భవనాన్ని వట్టి చేతులతో పట్టుకొని ఎక్కేశాడు. ఈ సమయంలో పడిపోతే ప్రాణాలు కాపాడుకునేందుకు కూడా కనీసం ఒక తాడు సాయం కూడా తీసుకోలేదు.
‘అరవై ఏళ్లు వచ్చాయంటే ముసలాళ్లు అయిపోయామని కాదు. ఈ వయసులో కూడా మనం ఎన్నో అద్భుతాలు చేయొచ్చు. ఆ సందేశం ఇవ్వడానికే ఈ సాహసం చేశా’ అని రాబర్ట్ చెప్తున్నాడు. ఇతను తొలిసారిగా 1975లో పారిస్‌లోని 613 అడుగుల ఎత్తయిన భవనం టోటల్ ఎరన్జీస్ని పలుమార్లు ఇలాగే ఎక్కేసి వార్తల్లో నిలిచాడు.