ఇస్లామాబాద్: ఆరేళ్ల కుమారుడ్ని కోల్పోయిన బాధలో ఉన్న పేరెంట్స్కు ఆ విమానయాన సంస్థ మరింత దుఃఖాన్ని మిగిల్చింది. బాలుడి మృతదేహాన్ని వదిలి కేవలం తల్లిదండ్రులను తీసుకెళ్లింది. (Boy Body Left Behind) ఎయిర్పోర్ట్కు చేరిన తర్వాత ఈ విషయం తెలుసుకున్న బాలుడి పేరెంట్స్ ఆ విమానయాన సంస్థ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్థాన్లో ఈ సంఘటన జరిగింది. పీవోకేలోని స్కర్డులో కత్షి గ్రామానికి చెందిన ఆరేళ్ల ముజ్తబా శరీరంలో కణితి ఏర్పడంతో అనారోగ్యానికి గురయ్యాడు. రావల్పిండిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ బాలుడు మరణించాడు.
కాగా, కుమారుడి మృతదేహాన్ని సొంత గ్రామానికి రోడ్డు మార్గంలో తరలించేందుకు ఒక రోజు సమయం పట్టడంతో విమానంలో తరలించాలని తల్లిదండ్రులు భావించారు. బాలుడి మృతదేహాన్ని ఇస్లామాబాద్ ఎయిర్పోర్ట్కు చేర్చారు. అయితే తీవ్ర విషాదంలో మునిగిన ఆ పేరెంట్స్కు పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ (పీఐఏ) సిబ్బంది షాక్ ఇచ్చారు. మంత్రి కోసం నాలుగు గంటలు ఆలస్యంగా బయలు దేరిన ఆ విమానం ఉద్దేశపూర్వకంగా బాలుడి మృతదేహాన్ని ఎయిర్పోర్ట్లో వదిలేసినట్లు ఆ దేశ మీడియా ఆరోపించింది.
మరోవైపు స్కర్డు ఎయిర్పోర్ట్లో ఆ విమానం ల్యాండైన తర్వాత ఈ విషయం తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు షాక్ అయ్యారు. ఆ విమానయాన సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పొరపాటు జరిగిందని, దీనిని సరిదిద్దుతామని పీఐఏ వివరణ ఇచ్చింది.