Weapons | న్యూఢిల్లీ: ఆసియా ఖండంలో ఉద్రిక్తతలు, ఉక్రెయిన్, గాజాలో యుద్ధాలు ఆయుధ వ్యాపారుల పంట పండించాయి. ఈ సాయుధ ఘర్షణల నేపథ్యంలో పశ్చిమాసియా, రష్యాలోని ఆయుధ ఉత్పత్తిదారులు భారీగా లాభాలు ఆర్జించారని ఓ నివేదిక పేర్కొంది. గత ఏడాది ప్రపంచంలోని 100 భారీ ఆయుధ కంపెనీలు సుమారు రూ.53 లక్షల కోట్ల (632 బిలియన్లు) విలువైన ఆయుధాలను విక్రయించాయని స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సిప్రీ) వెల్లడించింది. రెండేండ్ల క్రితం (2022) ఒక్కసారిగా డిమాండ్ పెరిగినప్పటికీ దానిని అందుకోవడంలో ఆయుధ కంపెనీలు విఫలమవడంతో వాటి ఆదాయం తగ్గిందని, అయితే గత ఏడాది ఉత్పత్తిని పెంచడం ద్వారా లాభాలు అందుకున్నాయని ఆ నివేదిక వివరించింది.
ఈ వంద భారీ ఆయుధ కంపెనీల చరిత్రలోనే మొదటిసారిగా అవి గత ఏడాది రూ.8,470 కోట్ల మేరకు అధిక అమ్మకాలు చేశాయని ఆ నివేదిక తెలిపింది. ఈ ఏడాదితోపాటు వచ్చే ఏడాది కూడా డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నదని భావిస్తున్న ఆయుధ కంపెనీలు సిబ్బందిని భర్తీ చేసుకొనే ప్రక్రియను మరింత వేగవంతం చేశాయని సిప్రీ సంస్థకు చెందిన పరిశోధకుడు లారెన్జో స్కరాజాటో తెలిపారు. గాజా, ఉక్రెయిన్ యుద్ధ అవసరాలను తీర్చడంలో చిన్న ఆయుధ కంపెనీలు ప్రభావవంతంగా పనిచేశాయని పేర్కొన్నారు.