టెహ్రాన్: బొగ్గు గనిలో (coal mine blast) పేలుడు సంభవించింది. మీథేన్ గ్యాస్ లీక్ కారణంగా జరిగిన ఈ పేలుడులో రెండు బ్లాకుల్లో పని చేస్తున్న 51 మంది కార్మికులు మరణించారు. మరో 20 మంది కార్మికులు గాయపడ్డారు. మృతదేహాలను వెలికి తీసేందుకు, గాయపడిన కార్మికులను బయటకు తెచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఇరాన్‌లోని దక్షిణ ఖొరాసన్ ప్రావిన్స్‌లో ఈ సంఘటన జరిగింది. శనివారం రాత్రి 9 గంటలకు మదంజూ కంపెనీ నిర్వహిస్తున్న బొగ్గు గనిలోని బీ, సీ బ్లాకుల్లో మీథేన్ గ్యాస్ రిలీజ్ కావడంతో పేలుడు జరిగినట్లు సౌత్ ఖొరాసన్ ప్రావిన్స్ గవర్నర్ అలీ అక్బర్ రహీమి తెలిపారు. సుమారు 51 మంది కార్మికులు మరణించగా మరో 20 మంది గాయపడినట్లు మీడియాతో అన్నారు.
కాగా, బీ బ్లాక్‌లో రెస్క్యూ ఆపరేషన్ పూర్తయిందని రహీమీ తెలిపారు. ఈ బ్లాక్‌లో పని చేసిన 47 మంది కార్మికుల్లో 30 మంది మరణించారని, మరో 17 మంది గాయపడ్డారని చెప్పారు. సీ బ్లాక్‌లో సహాయక చర్యలు ప్రారంభమయ్యాయని అన్నారు. ఈ బ్లాక్‌లో మీథేన్ సాంద్రత ఎక్కువగా ఉందని, రెస్క్యూ ఆపరేషన్‌కు ఎక్కువ సమయం పడుతుందని తెలిపారు. పేలుడు సమయంలో ఈ బ్లాక్‌లో 69 మంది కార్మికులు ఉన్నట్లు చెప్పారు. గాయపడిన 17 మందిని ఆసుపత్రికి తరలించామని, 24 మంది మిస్ అయ్యారని వెల్లడించారు. మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు.