ఢాకా, జూలై 16 : బంగాళాఖాతంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మయన్మార్ కోస్తా తీరానికి ఆవల బంగాళాఖాతంలో రెండు పడవలు బోల్తాపడిన ప్రమాదంలో 500 మంది రోహింగ్యా శరణార్థులు మరణించారు. సంఘర్షణ ప్రభావిత రఖైన్ రాష్ట్రం, బంగ్లాదేశ్‌లోని శరణార్థి శిబిరాల నుంచి రెండు పడవుల్లో జూన్‌లో 530 మంది శరణార్థులు బయలుదేరగా, జూలై 8న జరిగిన ప్రమాదాల్లో 500 మంది మరణించారు. ఐరాస వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం.. ప్రతికూల వాతావరణంతో పడవలు బోల్తాపడ్డాయి.
ఇందులో 250 మందితో ఉన్న ఒక పడవతో బయలుదేరిన కొద్దిసేపటికే కమ్యూనికేషన్ సంబంధాలు తెగిపోయాయని, 280 మందితో బయలుదేరిన మరో నౌక బోల్తాపడిందని అధికారులు తెలిపారు. రెండో పడవ మయన్మార్‌లోని ఇరావడి తీరంలో బోల్తాపడి ఉండవచ్చునని చెప్పారు. ఈ బోట్లలో ప్రయాణిస్తున్న వారిలో బంగ్లాదేశ్ శిబిరాలకు చెందిన శరణార్థులు కూడా ఉన్నారు. అయితే మృతుల సంఖ్యను అధికారికంగా నిర్ధారించ లేదు. ఈ ఘటనలపై అంతర్జాతీయ వలసల సంస్థ (ఐఓఎం) తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.