ఇస్లామాబాద్: పాకిస్థాన్(Pakistan)లోని బలోచిస్తాన్ ప్రావిన్సులో రిమోట్ కంట్రోల్‌తో బాంబును పేల్చిన ఘటనలో ఏడుగురు మృతిచెందారు. దాంట్లో అయిదుగురు స్కూల్ పిల్లలు, ఓ పోలీసు ఉన్నారు. ఈ ఘటనలో 17 మంది గాయపడ్డారు. పోలీసు వ్యాన్‌ను టార్గెట్ చేస్తూ రిమోట్ కంట్రోల్ బ్లాస్ట్‌కు పాల్పడ్డారు. ఇవాళ ఉదయం 8.35 నిమిషాలకు ఈ ఘటన జరిగింది.
మస్తాంగ్ జిల్లాలోని సివిల్ హాస్పిటల్ చౌక్ వద్ద ఉన్న ఓ గర్ల్స్ హై స్కూల్ సమీపంలో పేలుడు సంభవించింది. పార్కింగ్ చేసి ఉన్న మోటర్‌బైక్‌లో పేలుడు పదార్ధాన్ని దాచిపెట్టి.. రిమోట్ కంట్రోల్ ద్వారా ఉగ్రవాదులు ఆ బాంబును పేల్చినట్లు అధికారులు తెలిపారు. పోలీసు మొబైల్ వ్యాన్.. పార్కింగ్ బైక్ వద్దకు రాగానే ఐఈడీని పేల్చారు. ఆ పేలుడులో స్కూల్ వ్యాన్ కూడా చిక్కుకున్నది.
శక్తివంతమైన పేలుడు ధాటికి స్కూల్ పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. 8 నుంచి 13 ఏళ్ల మధ్య వయసున్న విద్యార్థినులు గాయపడ్డారు. వారిని సమీప ఆస్పత్రికి తీసుకెళ్లారు. తీవ్రంగా గాయపడ్డవారిని క్వెట్టా హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.