హెచ్1బీ వీసా ఫీజు పెంపు కన్నా ప్రమాదకర ధోరణి ప్రవాస భారతీయులను భయపెడుతున్నది. ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ అంటూ ట్రంప్ మద్దతు గ్రూపులు అమెరికన్ సమాజంలో పరోక్షంగా నింపుతున్న విద్వేషం ఆందోళనకర స్థాయికి చేరుతున్నది. హెచ్1బీ ఫీజు ప్రకటన నేపథ్యంలో భారతీయులు తిరిగి అమెరికా రాకుండా మాగా, ఆన్లైన్ ఫోరం ‘4చాన్’ ప్రయత్నించినట్టు తేలింది.
వాషింగ్టన్, సెప్టెంబర్ 21: హెచ్-1బీ వీసా ఫీజును పెంచుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జారీచేసిన ఉత్తర్వులు భారతీయులను తీవ్రంగా కుదిపేశాయి. ట్రంప్ ప్రకటన నేపథ్యంలో చాలా కంపెనీలు ఇతర దేశాల్లోని తమ హెచ్1బీ వీసా ఉద్యోగులను వెంటనే అమెరికాకు రావాలని ఆదేశాలు జారీచేశాయి. దీంతో హెచ్1బీ వీసా కలిగిన భారతీయ ఉద్యోగులు కూడా ఆగమేఘాలపై అమెరికాకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే భారతీయులను తిరిగి అమెరికాకు రాకుండా అడ్డుకునేందుకు ట్రంప్ మద్దతుదారు గ్రూపులైన మాగా (మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్), 4చాన్ కుట్ర పన్నినట్టు తెలుస్తున్నది. విమాన టికెట్లను బ్లాక్ చేసేందుకు ‘4చాన్’ వెబ్సైట్ యూజర్లు, ‘మాగా’ సంయుక్తంగా ‘క్లాగ్ ది టాయ్‌లెట్’ ఆపరేషన్ చేపట్టాయి. ఇదెలా సాగిందంటే..‘గూగుల్‌లో ఇండియా-యూఎస్ ఫ్లైట్స్ కోసం వెతకండి. ఉదాహరణకు ముంబయి-శాన్ఫ్రాన్సిస్కో తీసుకోండి. చెక్అవుట్ కోసం చాలావరకు ఎయిర్‌లైన్స్ 15 నిమిషాలు తీసుకుంటాయి. ఇది చాలు. ఇండియన్స్ టికెట్ బుకింగ్ అడ్డుకోవడానికి’ అంటూ సందేశాలు వెల్లువెత్తాయి.
‘హెచ్1బీ న్యూస్‌తో ఇండియన్స్ అంతా ఉరుకులు పరుగులు పెడుతున్నారు. వాళ్లందర్నీ ఇండియాలో ఉంచాలంటే ఫ్లైట్ రిజర్వేషన్ సిస్టంను క్లాగ్ (స్తంభింపజేయటం) చేయాలి’ అంటూ ‘మాగా’ మద్దతుదారులు ఆన్లైన్ ఫోరంలో కోరారు. ఆ తర్వాత కొందరు తాము బ్లాక్ చేసిన సీట్ల స్క్రీన్షాట్లను ఆన్లైన్లో పోస్ట్ చేశారు. కాగా ట్రంప్ మద్దతుదారుల చర్య అమెరికా ఫ్లైట్ చార్జీలను అనూహ్యంగా పెంచేందుకు దారితీసింది. వారు హెచ్-1బీ ఉద్యోగుల విమాన ప్రయాణాల్ని దెబ్బతీయగలిగారు. ‘ఆపరేషన్ క్లాగ్ ది టాయ్‌లెట్’ కోసం ‘4చాన్’ యూజర్లు, మాగా (ట్రంప్ మద్దతుదారులు) కలిసికట్టుగా పనిచేశారు. ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోకుండా తాత్కాలికంగా నిరోధించారు. ఆదివారం ఉదయం 9.31 గంటల కల్లా అమెరికాకు చేరుకోవాలంటూ టెక్ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, అమెజాన్ తమ ఉద్యోగులకు సూచించాయి. దీంతో ఇండియా-అమెరికా ఆదివారం ఫ్లైట్ చార్జీలు రెండింతలు అయ్యాయి. ఎక్కడ పెనాల్టీలు కట్టాల్సి వస్తుందోనన్న ఆందోళనతో భారీ డిమాండ్ ఏర్పడింది.