వాషింగ్టన్: అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించి అధికారుల చేతికి చిక్కిన వలసదారుల (Illegal Immigrants) నుంచి రూ.4.49 లక్షల ‘నిర్బంధ రుసుము’ (Apprehension Fee) వసూలు చేయాలని ట్రంప్ సర్కార్ (Donald Trump) నిర్ణయించింది. దీనికి అదనంగా ప్రతి రోజూ సుమారు రూ.90 వేలను వారి నుంచి వసూలు చేయనున్నారు. ఈ విధానంలో అక్రమ వలసదారులను గుర్తించిన వెంటనే వారిపై అధికారులు నేరాభియోగాలు నమోదు చేయవచ్చు. 14 ఏండ్లు పైబడిన వారు, అనుమతి లేకుండా దేశంలోకి ప్రవేశించి అరెస్టయిన వారు, వలస చట్టం ప్రకారం అమెరికాలో ప్రవేశానికి అనర్హులైన వారి నుంచి ఈ రుసుములను వసూలు చేస్తారు.
కొత్త విధానం దేశ వ్యాప్తంగా సరిహద్దులతో నిమిత్తం లేకుండా అన్ని ప్రాంతాల్లోని పాత, కొత్త అక్రమ వలసదారులందరికీ వర్తిస్తుంది.సెప్టెంబర్ నుంచే ఈ కొత్త విధానం అమలైనట్టు హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ తెలిపింది. ఒక్కో అక్రమ వలసదారును గుర్తించి, నిర్బంధించి, వారిని స్వదేశాలకు పంపడానికి అమెరికా ప్రభుత్వానికి సుమారు రూ.15 లక్షలు ఖర్చవుతుంది. ఇందులో కొంత అక్రమ వలసదారుల నుంచే వసూలు చేయాలని ట్రంప్ యంత్రాంగం నిర్ణయించింది.