వాషింగ్టన్: అమెరికాలో కాల్పుల ఘటనలు ఇప్పట్లో ఆగేలా కనిపించడంలేదు. దేశంలో నానాటికి గన్‌కల్చర్ పెరిగిపోతున్నది. దీంతో క్రమం తప్పకుండా కాల్పుల ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా మరోసారి తుపాకీ మోతమోగింది. పశ్చిమ మేరీల్యాండ్‌లోని (Maryland) స్మిత్‌బర్గ్‌లో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు.
గురువారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో స్మిత్‌బర్గ్‌లో ఉన్న కొలంబియా మెషీన్ ఫ్యాక్టరీలోకి చొరబడిన దుండగుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే భద్రతా సిబ్బంది జరిపిన ఎదురుకాల్పుల్లో షూటర్తోపాటు ఓ పోలీసుకు గాయాలయ్యాయి. దీంతో చికిత్స అందించిన అనంతరం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
కాగా, అమెరికాలో నానాటికీ గన్‌కల్చర్ అధికమవుతున్నది. నెల రోజుల వ్యవధిలో న్యూయార్క్, టెక్సాస్, ఓక్లహోమాలో జరిగిన ఘటనల్లో రెండంకెల సంఖ్యలో ప్రజలు మరణించారు. ఒక్క టెక్సాస్ ఘటనలోనే 22 మంది మరణించిన విషయం తెలిసిందే.