దుబాయ్: సౌదీ ఆరేబియా, యూఏఈ దేశాలు పాకిస్థానీలపై స్పెషల్ ఫోకస్ పెట్టాయి. పాకిస్థానీ ప్రజలు వ్యవస్థీకృతంగా యాచనకు పాల్పడుతున్నట్లు ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. దీని ద్వారా హింసా కూడా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. పాకిస్థానీ యాచకుల(Pakistani Beggars) వల్ల అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టకు భంగం కలుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. బిచ్చగాళ్లుగా మారిన సుమారు 24 వేల మంది పాకిస్థానీలను ఈ ఏడాది సౌదీ అరేబియా డిపోర్ట్ చేసింది. ఇక యూఏఈ దేశం మాత్రం పాకిస్థానీలపై వీసా ఆంక్షలను విధించింది.
గల్ప్ దేశాల్లోకి ప్రవేశించిన తర్వాత పాకిస్థానీలు నేరాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. పాకిస్థాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డేటా ఈ సమస్యను స్పష్టంగా తెలియజేస్తున్నది. వ్యవస్థీకృతంగా సాగుతున్న యాచనను నియంత్రించే క్రమంలో 66 వేల మందిని ఆఫ్‌లోడ్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఎఫ్ఐఏ డైరెక్టర్ జనరల్ రిఫాట్ ముక్తార్ మాట్లాడుతూ బెగ్గింగ్ నెట్‌వర్క్‌లు పాకిస్థాన్ ప్రతిష్టను దెబ్బతీస్తున్నట్లు చెప్పారు. గల్ఫ్‌తో పాటు ఆఫ్రికా, యూరోప్ దేశాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందన్నారు. బిచ్చం ఎత్తుకుంటున్నారన్న ఆరోపణలపై 24 వేల మంది పాకిస్థానీలను సౌదీ అరేబియా, దుబాయ్ 6 వేల మందిని, అజర్బైజాన్ 2500 మందిని వెనక్కి పంపినట్లు ముక్తార్ చెప్పారు.